అద్దె చెల్లించలేదని.. కడప ఆర్టీసీ పాత బస్టాండ్ మూత.. చర్చల అనంతరం అనుమతి!

  • నగర పాలక సంస్థకు రూ. 2.30 కోట్ల బకాయిలు
  • అద్దె చెల్లించాలంటూ ప్రభుత్వానికి మునిసిపల్ కమిషనర్ లేఖ 
  • ఫలితం లేకపోవడంతో మూసివేత నిర్ణయం
  • బస్టాండులోకి బస్సులు రాకుండా అడ్డుకున్న అధికారులు
  • ఇబ్బంది పడిన ప్రయాణికులు
కొన్నేళ్లుగా అద్దె చెల్లించకుండా రూ. 2 కోట్లకుపైగా బాకీపడిన కడప పాత ఆర్టీసీ బస్టాండును నగరపాలక సంస్థ నిన్న మూసేసింది. వేకువ జామునే బస్టాండుకు చేరుకున్న నగర పాలక సంస్థ అధికారులు అక్కడికి బస్సులు రాకుండా అడ్డుకున్నారు. దీంతో వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడ్డారు. చేసేది లేక రహదారిపైకి వచ్చి బస్సుల కోసం ఎదురుచూశారు. ఈ బస్టాండును నగరపాలక సంస్థ నిర్మించింది. దానిని వినియోగించుకుంటున్నందుకు ఆర్టీసీ నెలనెలా అద్దె చెల్లిస్తోంది. అయితే, గత కొంతకాలంగా అద్దె చెల్లించకపోవడంతో అది కాస్తా రూ. 2.30 కోట్లకు చేరుకుంది.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావడంతో నగర పాలక సంస్థ కొత్త కమిషనర్ సాయి ప్రవీణ్ చంద్ ఆర్టీసీ అద్దె బకాయిలపై ప్రభుత్వానికి లేఖ రాశారు. అద్దె చెల్లించాలని కోరారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో బస్టాండును మూసివేయాలని నిర్ణయించారు. తాజాగా, నిన్న బస్టాండుకు చేరుకున్న మునిసిపల్ అధికారులు బస్సులను అడ్డుకున్నారు. బస్సులను అడ్డుకోవడంతో ఇబ్బందులు పడిన ప్రయాణికులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు.

విషయం తెలిసిన అఖిలపక్ష నేతలు కూడా వారికి జతకలిశారు. బస్టాండులోకి బస్సులను అనుమతించాలని డిమాండ్ చేశారు. దీంతో ఎట్టకేలకు ఉదయం 8 గంటలకు బస్సులను అనుమతించారు. అయితే, ఆ తర్వాత కూడా అధికారులు బస్సులను అడ్డుకున్నారు. చర్చల అనంతరం చివరికి మధ్యాహ్నం నుంచి బస్సులను అనుమతించారు.


More Telugu News