కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల వేళ... అశోక్ గెహ్లాట్ కు షాకిచ్చిన రాహుల్ గాంధీ

  • కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
  • రేసులో అందరికంటే ముందున్న అశోక్ గెహ్లాట్
  • అధ్యక్ష పదవితో పాటు రాజస్థాన్ సీఎంగానూ కొనసాగుతానన్న గెహ్లాట్
  • ఒక వ్యక్తి.. ఒకే పదవి నియమాన్ని పాటించాల్సిందేనన్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి గురువారం కీలక అడుగు పడింది. అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా... ఆ పదవి కోసం పోటీ పడే హస్తం పార్టీ నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎంతమంది పోటీ పడినా... సోనియా గాంధీ ఆశీస్సులు ఉన్న వారే విజయ బావుటా ఎగురవేయడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సోనియా ప్రతిపాదించిన పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దాదాపుగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దక్కినా... తాను రాజస్థాన్ సీఎంగా కూడా కొనసాగుతానంటూ ఆయన ఓ ప్రతిపాదన పెట్టారు. 

గురువారం కేరళలో సాగుతున్న భారత్ జోడో యాత్రకు వచ్చిన అశోక్ గెహ్లాట్... రాహుల్ గాంధీని కలిశారు. తాను పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో తాను రెండు పదవులను కూడా లాగగలనంటూ చెప్పారట. అప్పటికప్పుడు ఏమీ స్పందించని రాహుల్ గాంధీ... గంటల వ్యవధిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాత్రం ఒక వ్యక్తి.. ఒకే పదవి అనే నినాదంతోనే ముందుకు సాగనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఉదయ్ పూర్ లో నిర్వహించిన పార్టీ సమావేశాల్లో ఇదే తీర్మానాన్ని ఆమోదించామని, అందరూ ఆ తీర్మానాన్ని పాటించాల్సిందేనని చెప్పారు. ఫలితంగా అధ్యక్ష పదవి చేపడితే రాజస్థాన్ సీఎం పదవిని వదలాల్సిందేనని గెహ్లాట్ కు రాహుల్ పరోక్షంగా చెప్పినట్టైంది.


More Telugu News