మంత్రి మందలింపుతో దిగొచ్చిన హెచ్ సీఏ.. ఈ రోజు రాత్రి నుంచి పేటిఎం ఇన్ సైడర్లో టికెట్ల విక్రయాలు
- జింఖానా గ్రౌండ్స్ లో టికెట్ల కోసం భారీగా తరలివచ్చిన జనం
- తొక్కిసలాటలో 20 మందికి పైగా గాయాలు
- ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ఆన్ లైన్ విక్రయాలు చేపట్టాలని ఆదేశం
సరైన ప్రణాళిక లేకుండానే భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఈ నెల 25న ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల విక్రయాన్ని చేపట్టిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మందలింపుతో ఎట్టకేలకు దిగివచ్చింది. మ్యాచ్ టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించేందుకు గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి పేటిఎం ఇన్ సైడర్ యాప్ లో టికెట్లను విక్రయించనున్నట్లుగా తెలిపింది.
సరిపడ భద్రత లేకుండా, ఏమాత్రం ప్రణాళిక లేకుండా హెచ్ సీఏ చేపట్టిన టికెట్ల విక్రయం సందర్భంగా గురువారం ఉదయం జింఖానా గ్రౌండ్స్ లో భారీ ఎత్తున తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 20 మందికిపైగా గాయాలు కాగా... ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. టికెట్ల కోసం వచ్చిన వారిపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి... హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ సహా సభ్యులంతా తన వద్దకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తన వద్దకు వచ్చిన వారితో చర్చించిన మంత్రి... ఆన్ లైన్ విక్రయాలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.