ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఇదే

  • ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మార్చిన వైసీపీ సర్కారు
  • సోషల్ మీడియా వేదికగా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
  • ఎన్టీఆర్, వైఎస్సార్ లను గొప్ప నాయకులుగా పేర్కొన్న నటుడు
  • పేరు మార్పు వల్ల ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు, వైఎస్సార్ స్థాయిని పెంచదని వ్యాఖ్య
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును మారుస్తూ వైసీపీ సర్కారు బుధవారం సభలో ఓ కీలక బిల్లును ప్రవేశపెట్టగా సభ ఆమోదించిన విషయం విదితమే. అయితే, వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై టీడీపీ సహా పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

తాజాగా ఎన్టీఆర్ మనవడు, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురువారం ఈ వ్యవహారంపై స్పందించాడు. ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు అని తారక్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదన్న జూనియర్ ఎన్టీఆర్... అదే సమయంలో ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని తెలిపాడు. 'విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు' అని తారక్ పేర్కొన్నాడు.


More Telugu News