కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికల నోటిఫికేషన్ జారీ... పోటీకి సై అంటున్న డిగ్గీ రాజా

  • ఈ నెల 24 నుంచి నామినేషన్ల దాఖలుకు అవకాశం
  • ఎన్నిక అనివార్యమైతే అక్టోబర్ 17న పోలింగ్
  • అక్టోబర్ 19న వెలువడనున్న ఫలితాలు
  • బరిలో నిలిచేందుకు డిగ్గీ రాజా ఆసక్తి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 24 నుంచి మొదలు కానున్న నామినేషన్ల స్వీకరణ ఈ నెల 30తో ముగియనుంది. అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8 వరకు గడువు ఉంది. ఆ తర్వాత బరిలో ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే... అక్టోబర్ 17న పోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 19న ఫలితాలను వెల్లడిస్తారు. 

రాహుల్ గాంధీయే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలంటూ ఇప్పటికే దాదాపుగా 8 రాష్ట్రాల పీసీసీలు ఏకగ్రీవ తీర్మానాలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్లకు గడువు ముగిసేలోగా మరిన్ని రాష్ట్రాల పీసీసీలు కూడా ఇదే తరహా తీర్మానాలు ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో రాహుల్ తనకు కీలక పదవి వద్దంటే మాత్రం అధ్యక్ష పదవికి పోటీ చేస్తామంటూ చెబుతున్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాదిరిగా ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ కూడా తోడయ్యారు. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు డిగ్గీ రాజా ఆసక్తి చూపుతున్నట్లుగా కథనాలు వస్తున్న నేపథ్యంలో నేడు సోనియా గాంధీతో భేటీ కోసం ఆయన ఢిల్లీకి వెళుతున్నారు.


More Telugu News