చంద్రబాబు వంటి నాయకుల వల్లే మేనిఫెస్టోకు విలువ లేకుండా పోతోంది: అసెంబ్లీలో సీఎం జగన్ వ్యాఖ్యలు

  • ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ రంగంపై చర్చ
  • చంద్రబాబు రైతులను దగా చేశాడన్న సీఎం జగన్
  • రుణమాఫీపై మాట తప్పాడని ఆరోపణ
  • ఆఖరికి సున్నా వడ్డీ కూడా చెల్లించలేదని వ్యాఖ్యలు
రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా విపక్షనేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. 

నాడు రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తానని మాటిచ్చిన చంద్రబాబు రైతులను దగా చేశాడని తెలిపారు. రుణమాఫీపై చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చాడని విమర్శించారు. ఆఖరికి రైతులకు సున్నా వడ్డీని సైతం ఎగ్గొట్టారని అన్నారు. చంద్రబాబు వంటి నేతల వల్లే మేనిఫెస్టోకు విలువ లేకుండా పోతోందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. 

చంద్రబాబు హయాంలో రైతులకు బీమా పరిహారం కూడా అందలేదని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకున్నామని, రైతుల కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం అందిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా తామే చెల్లిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. 

చంద్రబాబు పాలనలో ప్రతి ఏడాది కరవేనని... చంద్రబాబు, కరవు కవలలు అని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ మూడేళ్లలో ఒక్క మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదని సీఎం జగన్ పేర్కొన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా జలకళ ఉట్టిపడుతోందని, ఇటు కుప్పం నుంచి అటు ఇచ్ఛాపురం వరకు వాగులు వంకలు, చెరువులు, ఇతర జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయని వివరించారు. ఏపీలోని ఐదు ప్రధాన నదులు పరవళ్లు తొక్కుతున్నాయని, గోదావరి, కృష్ణా డెల్టాతో పాటు రాయలసీమ రైతులకు అత్యధికంగా సాగునీరు అందుతోందని అన్నారు.


More Telugu News