జగన్ ఏ ఆత్మతో మాట్లాడి ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయం తీసుకున్నారో తెలియదు: నారా లోకేశ్

  • ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చిన వైసీపీ ప్రభుత్వం
  • అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం.. మండిపడిన లోకేశ్
  • బిల్లులను ఏకపక్షంగా ఆమోదిస్తున్నారని విమర్శ 
  • తాము అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్టీఆర్ పేరే పెడతామని ఉద్ఘాటన
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మార్చడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. జగన్ తెలుగు జాతి మొత్తం బాధపడే నిర్ణయాన్ని తీసుకున్నారని విమర్శించారు. 

ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని వైసీపీ నేతలు కూడా ఇష్టపడడంలేదని అన్నారు. ఏ ఆత్మతో మాట్లాడి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదని వ్యంగ్యం ప్రదర్శించారు. 'మేం అధికారంలోకి వచ్చాక ఇదే రీతిలో అన్ని పేర్లు మార్చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి' అని పేర్కొన్నారు. రాష్ట్రాలకు కూడా పేర్లు మార్చుకుంటూ పోతే ఇంకెలా ఉంటుందో చూడండని అన్నారు. 

"మోదీ గారు దేశ ప్రధానిగా రెండో పర్యాయం కూడా గెలిచారు. కానీ ఢిల్లీలో ఇందిరా గాంధీ పేరుతో ఎయిర్ పోర్టు ఉంటే ఆమె పేరును ఆయన తొలగించలేదు. హైదరాబాదులో ఉన్న ఎయిర్ పోర్టుకు రాజీవ్ గాంధీ పేరు తొలగించలేదు. ఈ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గ్రహించాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ, బీజేపీ, వామపక్షాలు ఖండిస్తున్నాయి. సభలో తామెంత పోరాడినా 9 బిల్లులను ఏకపక్షంగా ఆమోదింపజేసుకున్నారు" అని లోకేశ్ మండిపడ్డారు. 

తమకు భయపడి అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులే పెట్టారని, వీళ్లు పిరికివాళ్లని, ఈ సైకో తమను తట్టుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక హెల్త్ యూనివర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరే పెడతామని లోకేశ్ స్పష్టం చేశారు. ఇది ఇవాళ పెట్టిన పేరు కాదని, 1998లో చంద్రబాబు పెట్టిన పేరని అన్నారు. చంద్రబాబు హయాంలోనే జిల్లాకొక మెడికల్ కాలేజీ వచ్చిందని వెల్లడించారు.


More Telugu News