'చంద్రబాబు కంటే ఎన్టీఆర్ కు నేనే ఎక్కువ గౌరవం ఇస్తా'నన్న సీఎం జగన్.. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు శాసనసభ ఆమోదం

  • ఎన్టీఆర్ అనే పదం చంద్రబాబుకు ఇష్టం లేదన్న సీఎం  
  • వెన్నుపోటు పొడవకుండా ఉంటే ఆయన చాలా కాలం బ్రతికిఉండేవారన్న సీఎం 
  • చంద్రబాబు కావాలనే సభ్యులతో గొడవ చేయించారని విమర్శ  
ప్రతిపక్షం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు ఆంధప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. దీనికి డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్సిటీ గా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. బుధవారం మంత్రి విడదల రజనీ ఈ సవరణ బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టగా.. సభ్యులు ఆమోదం తెలిపారు. అన్నీ ఆలోచించిన తర్వాతే పేరు మార్పు నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాసన సభలో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉండి ఉంటే బాగుండేదని జగన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు కావాలనే సభ్యులతో గొడవ చేయించారని ఆరోపించారు.

ఎన్టీఆర్ కు చంద్రబాబు కంటే తానే ఎక్కువ గౌరవం ఇస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్టీఆర్ అంటే తనకు ఎలాంటి కోపం లేదన్నారు. ఇప్పుడే కాదు గతంలో కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదన్నారు. ఎన్టీఆర్ పై తనకు మమకారమే ఉందన్నారు. కానీ, ఎన్టీఆర్ అనే పదమే చంద్రబాబుకు ఇష్టం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే ఎన్టీఆర్ చాలా కాలం బ్రతికే ఉండేవారని అన్నారు. ఎన్టీఆర్ బ్రతికి ఉంటే చంద్రబాబు సీఎం అయ్యేవారు కాదని అన్నారు. 

అంతకుముందు ఈ సందర్భంగా మంత్రి రజనీ మాట్లాడుతూ... రూపాయి డాక్టర్ గా వైఎస్ఆర్ అందరికీ సుపరిచితం అన్నారు. ఎన్టీఆర్ మీద జగన్‌ కు గౌరవం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలను వైఎస్సార్ 11కు  చేశారని, వాటిని జగన్ 28 మెడికల్ కాలేజీలకు చేర్చారని తెలిపారు. ఆ క్రెడిట్ తీసుకోవాలనే .. హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టామని తెలిపారు.


More Telugu News