ఆసీస్ దూకుడు ముందు ఆ స్కోరు కూడా చాల్లేదు... తొలి టీ20లో టీమిండియా ఓటమి

  • మొహాలీలో 4 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం
  • 209 పరుగుల టార్గెట్ ను ఛేదించిన కంగారూలు
  • రాణించిన గ్రీన్, మాథ్యూ వేడ్, స్మిత్, టిమ్ డేవిడ్
  • సిరీస్ లో 1-0తో ఆధిక్యం పొందిన ఆసీస్
టీమిండియాతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు బోణీ కొట్టింది. మొహాలీలో భారీ స్కోర్లు నమోదైన తొలి టీ20 మ్యాచ్ లో ఆసీస్ 4 వికెట్ల తేడాతో భారత్ పై నెగ్గింది. భారత్ విసిరిన 209 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 

ఓపెనర్ కామెరాన్ గ్రీన్ (61), వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ (45 నాటౌట్), స్టీవ్ స్మిత్ (35), ఫించ్ (22), టిమ్ డేవిడ్ (18) రాణించడంతో ఆసీస్ విజయం సులువైంది. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 3, ఉమేశ్ యాదవ్ 2, చహల్ 1 వికెట్ తీశారు. 

అంతకుముందు భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. హార్దిక్ పాండ్యా (71 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్, కేఎల్ రాహుల్ (55) అర్ధసెంచరీ, సూర్యకుమార్ యాదవ్ (46) దూకుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. తద్వారా కంగారూల ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఆసీస్ దూకుడు ముందు అంతటి భారీ లక్ష్యం సైతం చిన్నబోయింది. 

ఆసీస్ లక్ష్యఛేదన ధాటిగా ఆరంభమైంది. ఓపెనర్ గా వచ్చిన ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గ్రీన్ 30 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు చేశాడు. గ్రీన్ వికెట్ ను అక్షర్ పటేల్ సాధించాడు. అంతకుముందు కెప్టెన్ ఆరోన్ ఫించ్ 13 బంతుల్లో 22 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. 

ఆ తర్వాత స్టీవ్ స్మిత్ 35 పరుగులు చేసి ఇన్నింగ్స్ కు ఊపునందించగా, హార్డ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ (1) పేలవంగా అవుటై నిష్క్రమించడంతో ఆసీస్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత వచ్చిన జోస్ ఇంగ్లిష్ (17) ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేసి తన ఖాతాలో మూడో వికెట్ ను చేర్చాడు. 

అయితే, వికెట్ కీపర్ మాథ్యూ వేడ్, టిమ్ డేవిడ్ జోడీ ఆసీస్ ను గెలుపు తీరాలకు చేరువలోకి తీసుకెళ్లింది. ఆఖరి ఓవర్లో కంగారూల విజయానికి 2 పరుగులు అవసరం కాగా, ఆ ఓవర్ తొలి బంతికే టిమ్ డేవిడ్ అవుటయ్యడు. ఆ తర్వాత వచ్చిన ప్యాట్ కమిన్స్ ఫోర్ బాదడంతో మ్యాచ్ ఆసీస్ వశమైంది.

ఈ విజయంతో ఆసీస్ మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 23న నాగపూర్ లో జరగనుంది.


More Telugu News