చంద్రబాబు పాలనలో డేటా చౌర్యం జరిగిందని ఈ కమిటీ నివేదికలో చెప్పలేకపోయింది: పయ్యావుల

  • పెగాసస్ అంశంపై భూమన కమిటీ మధ్యంతర నివేదిక
  • చంద్రబాబు హయాంలో డేటా చోరీ జరిగిందని ఆరోపణ
  • నివేదిక కాపీని అందరికీ చూపించిన పయ్యావుల
  • నివేదికలో అలాంటి విషయాలే లేవని స్పష్టీకరణ
  • భూమన కేవలం నోటిమాటగానే చెప్పారని వెల్లడి
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా, పెగాసస్ అంశంపై భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ నేడు మధ్యంతర నివేదిక ప్రవేశపెట్టడం తెలిసిందే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016-19 మధ్య డేటా చౌర్యం జరిగినట్టు ప్రాథమికంగా తేలిందని భూమన అసెంబ్లీలో తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను టీడీపీ నేతలు ఖండించారు. 

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, రాష్ట్ర డేటా సెంటర్ నుంచి ఆ డేటా ఎక్కడికి వెళ్లిందని వారు గూగుల్ ను అడిగారని, ప్రపంచంలోనే టెక్నాలజీ జెయింట్ గా ఉన్న గూగుల్ కూడా ఆ డేటా ఎక్కడికి వెళ్లిందో తాము గుర్తించలేమని చెప్పిందని, నివేదికలో ఈ విషయాన్నే చెప్పారని వెల్లడించారు. 

ఇందులో పేర్కొన్న ఐపీ అడ్రస్ లను ఎవరికీ కేటాయించలేదని గూగుల్ ఎంతో స్పష్టంగా చెప్పిందని అన్నారు. దీన్నిబట్టి కొండను తవ్వి దోమను కూడా పట్టలేకపోయారన్న విషయం అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. ఎంతో సున్నితమైన సమాచారం చోరీకి గురైందని అధికార పక్షం చెబుతోందని, ఆ సున్నితమైన సమాచారం ఏంటో చెప్పే ధైర్యం వారికి లేదని, చెబితే తేలిపోతారని పయ్యావుల వ్యాఖ్యానించారు. 

పెగాసస్ అంటున్నారని, మరి మధ్యంతర నివేదికలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? లేదా? అనే దానికి సంబంధించి ఒక్క పదం కూడా లేదని తెలిపారు. అసలక్కడేమీ జరగలేదు కాబట్టే, అధికారపక్షం తమ నివేదికలో ఏమీ చెప్పలేకపోయిందని విమర్శించారు. పెగాసస్ వాడలేదని తాము ఘంటాపథంగా చెప్పగలమని స్పష్టం చేశారు. 

ఇవాళ్టి ప్రభుత్వమే డేటా చోరీ చేస్తోందని, ఇంటింటికీ వాలంటీర్లను పంపించి ఆధార్ కార్డులు సేకరించి, టీడీపీ వాళ్ల ఆధార్ కార్డులను ఓటర్ లిస్టులకు అటాచ్ చేయవద్దని చెబుతోందని ఆరోపించారు. ఇవాళ గడప గడపకు వెళ్లినప్పుడు ఎవరికి ఏ లబ్ది చేకూరిందని, ఏ పథకం ఎవరికి ఇచ్చారని మీ పార్టీకి ఎలా సమాచారం వచ్చింది...  ఇది డేటా చౌర్యం కాదా? అని పయ్యావుల నిలదీశారు. 

పెగాసస్ పై సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ జరుపుతోంది... మీకు దమ్ము, చిత్తశుద్ధి ఉంటే ఏమీ లేని ఈ మధ్యంతర నివేదికను, ఈ మూడేళ్ల పాలనలో జరిగిన వ్యవహారాలను సుప్రీంకోర్టుకు నివేదించండి...అని సవాల్ విసిరారు. 

"ఎందుకు ఊరికే మాటలతో కాలం గడుపుతారు... చంద్రబాబు పాలనలో డేటా చౌర్యం జరిగిందని ఈ కమిటీ నివేదికలో చూపించలేకపోయింది, టీడీపీకి డేటా అందిందని భూమన కేవలం మాటల్లో చెప్పే ప్రయత్నం చేశారే తప్ప, ప్రాథమిక నివేదికలో దాని గురించిన ప్రస్తావనే లేదు" అని స్పష్టం చేశారు. 

కాగా, ఇలాంటి నివేదికలను సభలో సమర్పించేటప్పుడు పలు కాపీలను ప్రింట్ చేసి ఉంచుతారని, కానీ పెగాసస్ మధ్యంతర నివేదిక రెండు కాపీలే ఉన్నాయని చెప్పారని, తాము గట్టిగా అడిగి గొడవ చేస్తేనే ఇచ్చారని పయ్యావుల వెల్లడించారు. లేకపోతే ఈ నివేదిక కూడా బయటికి వచ్చేది కాదని, ఏదో జరిగిపోయిందనే ఒక భ్రమను కలిగించేవారని అన్నారు.


More Telugu News