భారత్​, ఆస్ట్రేలియా టీ20 టిక్కెట్లపై కీలక ప్రకటన చేసిన హైదరాబాద్ క్రికెట్​ సంఘం

  • మొత్తం టిక్కెట్లు పేటీఎంలోనే అమ్ముతామన్న హెచ్ సీఏ
  • పాసుల కోసం పోలీసులు, అధికారుల నుంచి తమపై ఒత్తిడి లేదని వెల్లడి
  • పీటీఎంలో ఇంకా అందుబాటులోకి రాని రెండో దఫా టిక్కెట్లు
భారత్–ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25వ తేదీ  హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మూడో టీ20 మ్యాచ్‌ టిక్కెట్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. కరోనా తర్వాత నగరంలో ఐపీఎల్ మ్యాచ్ లు లేకపోవడం, దాదాపు మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ కు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తుండటం, రోహిత్, కోహ్లీ వంటి స్టార్లు బరిలో ఉండటంతో ఎలాగైనా ఈ మ్యాచ్ టిక్కెట్లు సంపాదించాలని చిన్నాపెద్దా ప్రయత్నిస్తున్నారు. ఈ సిరీస్ అధికారిక టికెటింగ్‌ పార్ట్‌నర్‌ ‘పేటీఏం’ యాప్‌లో ఈ నెల 15వ తేదీన టిక్కెట్లు అందుబాటులో ఉంచితే..  క్షణాల్లోనే మాయం అయ్యాయి. మొదటి దశలో టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయని ‘పేటీఎం’ ప్రకటించింది.

అయితే,  ఎంత ప్రయత్నించినా.. ‘పేటీఎం’లో తమకు టిక్కెట్లు దొరకలేదని అభిమానులు చెబుతున్నారు. ఆఫ్ లైన్ కౌంటర్లలో విక్రయిస్తే నేరుగా వెళ్లి కొనుగోలు చేయాలని చూస్తున్నారు. కానీ, వారి ఆశలపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) ఇప్పుడు నీళ్లు కుమ్మరించింది. మ్యాచ్‌కు సంబంధించి అన్ని టిక్కెట్లను ‘పేటీఎం’ ద్వారానే విక్రయిస్తున్నట్టు హెచ్‌సీఏ సోమవారం ప్రకటించింది. అలాగే, పాసులు కావాలని పోలీసులు, ప్రభుత్వ అధికారులు తమను ఒత్తిడి చేస్తున్నారన్న వార్తలు అవాస్తవం అని తెలిపింది. టిక్కెట్ల విషయంలో తమపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేసింది.

 ఇలాంటి తప్పుడు వార్తలను అరికట్టడానికే మొత్తం టిక్కెట్లను ‘పేటీఎం’లోనే పారదర్శకంగా అమ్మకానికి ఉంచుతామని స్పష్టం చేసింది. అయితే, రెండో దఫాలో టిక్కెట్లను ఎప్పుడు విక్రయించేది ‘పేటీఎం’ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News