సౌందర్య లేకపోవడం వల్లనే ఆ సినిమా ఫ్లాప్ అయిందన్న దర్శకుడు సుబ్బయ్య

  • తన సినిమాలపై స్పందించిన ముత్యాల సుబ్బయ్య
  • ఆ పాత్రకి సౌందర్య కరెక్టు అంటూ వ్యాఖ్య 
  • 'తొలి వలపు' ఇంకా ఆడవలసిన సినిమా అంటూ వివరణ 
  • గోపీచంద్ అలా అనుకున్నాడంటూ వెల్లడి  
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్స్ లో ముత్యాల సుబ్బయ్య ఒకరు. బలమైన కథాకథనాలను సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. అలాంటి ముత్యాల సుబ్బయ్య ఖాతాలో 100 రోజులను పూర్తిచేసుకున్న సినిమాలు చాలానే కనిపిస్తాయి. అప్పట్లో బలమైన ఎమోషన్స్ కి సంబంధించిన ఏ కథ దొరికినా, ముందుగా నిర్మాతలు ముత్యాల సుబ్బయ్యనే సంప్రదించేవారు. అంతగా ఆయన ఈ తరహా సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు.

'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ .. 'చరణ దాసి' అని ఒక పాత సినిమా ఉంది. ఆ కథని భూపతిరాజా ఈ కాలానికి తగినట్టుగా మార్చాడు. ఆ కథతో నేను చేసిన సినిమానే 'ఒక చిన్నమాట'.  జగపతిబాబు -  ఇంద్రజ హీరో హీరోయిన్లు. అప్పటికి నేను సౌందర్యతో ఐదు సినిమాలు చేశాను. ఆమె అయితే ఈ సినిమాకి కరెక్టు అనుకున్నాను. కానీ ఇంద్రజను తీసుకోవలసి వచ్చింది. ఇక కథాపరంగా కూడా నేను అనుకున్న సెంటిమెంటు ట్రాకును దాటేసి ఎటో వెళ్లిపోతుంటే ఆపేద్దామనుకున్నాను.

'సార్ .. మీరు ఎన్నో హిట్లు ఇచ్చారు .. ఒకవేళ ఈ సినిమా పోయినంత మాత్రాన ఏమౌతుంది .. కానీయండి' అని మా స్టాఫ్ అంతా అన్నారు. సరే కానీయండి అంటూ ఆ సినిమాను చేయడం జరిగింది. అనుకున్నట్టుగానే ఆ సినిమా పోయింది. ఇక 'తొలివలపు' సినిమా విషయానికి వస్తే, అది నిజంగా జరిగిన సంఘటన. ఆ సినిమా బాగానే ఆడిందిగానీ, ఆశించినస్థాయి ఆదరణ లభించకపోవడం నాకు బాధను కలిగించింది. గోపీచంద్ కూడా యాక్షన్ సినిమా చేసుంటే బాగుండేదనే ఫీలింగులో ఉండిపోయాడు" అంటూ చెప్పుకొచ్చాడు.


More Telugu News