ఆంధ్రప్రదేశ్ 'అదానీ ప్రదేశ్' అయిపోయింది: చింతా మోహన్ విమర్శలు

  • అసెంబ్లీ సమావేశాలు అబద్ధాలతోనే గడిచిపోతున్నాయన్న చింతా మోహన్
  • పోలవరం ప్రాజెక్టు నిలిచిపోయిందని విమర్శ
  • మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ భూములను దోచుకుంటున్నారని ఆరోపణ
వైసీపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాలు అబద్ధాలతోనే గడిచిపోతున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రానికి అబద్ధాల ఆంధ్రప్రదేశ్ అనే పేరు వచ్చిందని చెప్పారు. రాజధాని అమరావతిని ఆపేశారని... పోలవరం ప్రాజెక్టు కూడా ఆగిపోయిందని విమర్శించారు. ఒకప్పుడు ఏమీ లేని అదానీ ఇప్పుడు ప్రపంచ కుబేరుడు అయిపోయారని అన్నారు. అదానీకి రాష్ట్రం మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం కట్టబెడుతోందని... ఆంధ్రప్రదేశ్ అదానీప్రదేశ్ అయిపోయిందని చెప్పారు. 

ఏపీలో కోటి మంది పేదలు ఆకలితో నిద్రపోతున్నారని... రాజన్న రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ల ధర ఆకాశాన్నంటుతోందని... ఇదే అంశం 2024లో యూపీఏను గెలిపిస్తుందని చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధరను రూ. 500కు తీసుకొచ్చే ఫైల్ పైనే తొలి సంతకం చేస్తామని అన్నారు. ఏపీని విడగొట్టమని దొంగ సలహాను ఇచ్చింది గులాం నబీ అజాద్ అని చెప్పారు.


More Telugu News