చండీగఢ్ యూనివర్సిటీలో అసలేం జరిగిందంటే..!

  • విద్యార్థినుల స్నానాల వీడియో కేసులో కీలక విషయం వెల్లడి
  • హాస్టల్లోని ఇతర విద్యార్థినుల వీడియోలను చిత్రీకరించాలని ఓ విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేసిన ఆమె ప్రియుడు!
  • సదరు మహిళ, ప్రియుడు, అతని స్నేహితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు
  • ఆందోళన విరమించిన విద్యార్థులు
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన చండీగఢ్ యూనివర్శిటీ విద్యార్థినుల స్నానాల వీడియో కేసులో కీలక విషయం వెల్లడైంది. ఈ కేసులో సన్నీ మెహతా అతని స్నేహితుడు రంకజ్ శర్మ తో పాటు  ఓ మహిళా విద్యార్థి అరెస్టయింది. హాస్టల్లోని ఇతర విద్యార్థినిల వీడియోలను చిత్రీకరించి తమకు పంపాలని ఆ యువతిని సన్నీ, రంకజ్ బ్లాక్ మెయిల్ చేసినట్టు తెలిసింది. లేకపోతే ఆమెకు చెందిన ప్రైవేట్ వీడియోలను వైరల్ చేస్తామని ఈ ఇద్దరూ బెదిరించారు. సదరు మహిళా విద్యార్థి... సన్నీ మెహతా ప్రియురాలు అని తెలుస్తోంది. 

నెట్ లో ఒకేఒక వీడియో..
యూనివర్సిటీ హాస్టల్లోని అనేక మంది మహిళల వ్యక్తిగత, అభ్యంతరకరమైన  వీడియోలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయని విద్యార్థులు ఆరోపించడంతో శనివారం అర్ధరాత్రి చండీగఢ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో భారీ నిరసనలు చెలరేగాయి. ఇది దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

హాస్టల్‌లో దాదాపు 60 మంది బాలికలు స్నానాలు చేస్తున్న వీడియోలు లీక్ అయ్యాయని విద్యార్థులు ఆరోపించారు. కానీ, కేవలం ఒకేఒక వీడియో నెట్ లో సర్క్యులేట్‌ అయిందని వర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. దీనికి కారణమైన వాళ్లు అరెస్టయ్యారని తెలిపింది. ఓ విద్యార్థి ఈ వీడియోను హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన తన స్నేహితుడికి స్వయంగా షేర్ చేసిందని తెలిపింది. వీడియో లీక్ కారణంగా క్యాంపస్ లో ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోలేదని స్పష్టం చేసింది.
 
ముగ్గురు నిందితులకు రిమాండ్
వీడియోలు రూపొందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థినిని పోలీసులు మొదట అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె ప్రియుడిగా భావిస్తున్న హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడు, అతని స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల ఫోన్లను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. సోమవారం ముగ్గురు నిందితులను మొహాలీలోని ఖరార్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు పది రోజుల రిమాండ్‌ను కోరారు. అయితే నిందితులను కోర్టు ఏడు రోజుల పోలీసు రిమాండ్‌కు పంపింది. 

సిట్ ఏర్పాటు చేసిన సీఎం మాన్..  
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశాల మేరకు మహిళా పోలీసు అధికారులతో కూడిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) విచారణకు ఏర్పాటు చేశారు. న్యాయమైన, పారదర్శకమైన విచారణ జరుగుతుందని హామీ ఇవ్వడంతో, చండీగఢ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు సోమవారం తెల్లవారుజామున 1.30 గంటలకు తమ నిరసనను ముగించారని మొహాలీ పోలీసులు తెలిపారు. అదే సమయంలో విశ్వవిద్యాలయం ఈ నెల 24 వరకు తరగతులకు సెలవులు ప్రకటించింది. దాంతో, చాలా మంది విద్యార్థులు క్యాంపస్ నుంచి తమ ఇళ్లకు వెళ్లిపోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఘటనపై విచారణకు వర్సిటీ కూడా తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.


More Telugu News