దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వెనుక మోదీ లేరని నమ్ముతున్నాను: మమతా బెనర్జీ

  • సీబీఐ, ఈడీలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న మమత 
  • విపక్షాల నేతలను బెదిరిస్తూ.. అరెస్టులు చేయిస్తోందని ఆరోపణ 
  • కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడి వ్యాపారవేత్తలు దేశం విడిచి పారిపోతున్నారని వ్యాఖ్య 
కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలకు సంబంధించి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ ప్రధాని కార్యాలయానికి రిపోర్ట్ చేయడం లేదని... అమిత్ షా నియంత్రణలో ఉన్న కేంద్ర హోంశాఖకు రిపోర్ట్ చేస్తోందని ఆమె అన్నారు. దేశంలోని వ్యాపారులపై బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈడీ, సీబీఐలకు భయపడి వ్యాపారవేత్తలు దేశం విడిచి పారిపోతున్నారని చెప్పారు. 

ఇదంతా మోదీ చేయడం లేదని తాను భావిస్తున్నానని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. అయితే, ఈ దుర్వినియోగం వెనుక మోదీ లేరనేది తన నమ్మకమని చెప్పారు. కొందరు బీజేపీ నేతలు కుట్రలకు పాల్పడుతుంటారని... తరచుగా నిజాం ప్యాలెస్ కు వెళ్తుంటారని దుయ్యబట్టారు. 

విపక్షాలకు చెందిన నేతలను ప్రతి రోజు బీజేపీ వేధిస్తోందని మమత ఆరోపించారు. సీబీఐ, ఈడీల చేత అరెస్టులు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇలాంటి తప్పుడు పనులు చేయవచ్చా? అని ఆమె ప్రశ్నించారు. మోదీ కాకుండా కొందరు ఇతర బీజేపీ నేతలు వారి వ్యక్తిగత స్వార్థం కోసం ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పీఎంఓకు రిపోర్ట్ చేయాల్సిన సీబీఐ... ఇప్పుడు కేంద్ర హాం శాఖ పరిధిలో పని చేస్తుండటం బాధాకరమని అన్నారు.


More Telugu News