తమ పిల్లాడిని నెమలీకలు తీసుకెళ్లనివ్వలేదని తల్లి ఫిర్యాదు.. స్పందించిన కేటీఆర్

  • తన ఐదేళ్ల కుమారుడికి నెమలీకలంటే ఎంతో ఇష్టమంటూ తల్లి లేఖ
  • చిన్నారులకు మినహాయింపు ఇవ్వాలని కేబీఆర్ పార్క్ అధికారులకు మంత్రి సూచన
  • జూపార్క్‌లోని సింహాలకు వైద్య పరీక్షలు చేయిస్తామని మరో నెటిజన్‌కు కేటీఆర్ హామీ
పిల్లలకి నెమలీకలంటే ఎంతిష్టమో వేరే చెప్పక్కర్లేదు. అవి దొరికితే పుస్తకాల్లో దాచుకుని మురిసిపోతారు. పిల్లలు పెట్టాయేమోనని రోజూ చూసుకుంటూ ఉంటారు. అలాంటి పిల్లలకు నెమలీకలు దొరికితే ఆనందంతో మైమరిచిపోతారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కుకు తల్లితో కలిసి వచ్చిన పిల్లాడు నెమలీకలు కనిపిస్తే ఆనందంతో ఏరుకున్నాడు. అయితే, ఇంటికి వెళ్తున్న సమయంలో అడ్డుకున్న పార్క్ అధికారులు వాటిని లాక్కున్నారు. దీంతో ఆ చిన్నారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కుమారుడి బాధ చూసిన ఆ తల్లి మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు.

తాను తన ఐదేళ్ల కుమారుడు వేదాంత్‌తో కలిసి పార్క్‌కు వెళ్లానని అందులో పేర్కొన్నారు. వేదాంత్‌కు నెమలీకలంటే ఎంతో ఇష్టమని, పార్క్‌లో దొరికిన వాటిని ఏరుకుని తీసుకెళ్తుండగా అధికారులు వాటిని లాక్కుని స్టోర్‌ రూములో పెట్టుకున్నారని అన్నారు. ఇలా స్టోర్‌ రూములో పెట్టుకోవడం కంటే పిల్లలకి ఇస్తే వారు సంతోషపడతారని పేర్కొన్నారు. ఈ లేఖపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 

నెమలీకల్ని తీసుకెళ్లనివ్వండి
ఆ తల్లి రాసిన లేఖ తనను ఎంతగానో కదిలించిందని కేటీఆర్ అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద నెమలీకలను తీసుకెళ్లడం నిషిద్ధమని అటవీ అధికారులు ఆంక్షలు విధిస్తున్నారన్న కేటీఆర్.. ఈ విషయంలో కేబీఆర్ పార్క్ అధికారులు పిల్లలకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే, మరో నెటిజన్ ట్వీట్‌పైనా మంత్రి స్పందించారు. 

హైదరాబాద్‌ జూపార్క్‌లోని సింహాలు అనారోగ్యంతో ఉన్నాయంటూ ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన.. వాటికి వెంటనే వైద్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు అతడికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన రాష్ట్ర అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి ఆర్ఎం డోబ్రియాల్.. జూలోని 20 సింహాల్లో రెండు మాత్రమే అనారోగ్యంతో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. ఇద్దరు వెటర్నరీ వైద్యులు వాటి ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.


More Telugu News