చైనా అంతరిక్ష పర్యాటకం... టికెట్ ఖరీదు రూ.2.2 కోట్లు!

  • రోదసిలోకి విహార యాత్రలు
  • ఎక్కువగా వినిపిస్తున్న అంతరిక్ష పర్యాటకం మాట
  • ప్రణాళికలు రూపొందిస్తున్న చైనా
  • 2025 నాటికి స్పేస్ ట్రిప్పులు
అంతరిక్షంలోకి మానవుడు వెళ్లడం అనేది నిన్నమొన్నటిదాకా పరిశోధనల పరంగానే చూస్తున్నారు. ఇప్పుడు అంతరిక్ష పర్యాటకం అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఏదో విహార యాత్రకు వెళ్లొచ్చినట్టుగా రోదసిలోకి వెళ్లి వచ్చే రోజులు ఇవి. 

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్, సర్ రిచర్డ్ బ్రాన్సన్ కు చెందిన వర్జిన్ గెలాక్టిక్, ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థలు ఈ స్పేస్ టూరిజంలో ప్రముఖ సంస్థలుగా గుర్తింపు పొందాయి.

బ్లూ ఆరిజన్ సంస్థ పర్యాటకులను భూమి నుంచి రోదసిలోకి 100 కిమీ వరకు తీసుకెళుతోంది. అంతరిక్షానికి సరిహద్దు రేఖగా భావించే కార్మెన్ లైన్ వరకు పర్యాటకులను తీసుకెళుతుంది.

ఇప్పుడు చైనా కూడా అంతరిక్ష పర్యాటకానికి ద్వారాలు తెరుస్తోంది. 2025 నాటికి పర్యాటకులతో రోదసి యాత్రలు చేయాలని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ అంతరిక్ష యాత్ర కోసం ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.2.2 కోట్ల నుంచి రూ.3.43 కోట్ల వరకు వసూలు చేయనున్నారు. 

కాగా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కూడా ఈ దిశగా ఆలోచిస్తోంది. అంతరిక్షంలోకి పర్యాటకులను తీసుకెళ్లే అంశంపై సంకేతాలు ఇస్తోంది.


More Telugu News