తైవాన్ ను కుదిపేసిన భారీ భూకంపం

  • ఆగ్నేయ తీరంలో ప్రకంపనలు
  • రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూకంపం
  • తైటుంగ్ పట్టణానికి ఉత్తరంగా భూకంప కేంద్రం
  • ఊగిపోయిన భవనాలు, రైళ్లు
  • పరుగులు తీసిన ప్రజలు
తైవాన్ ఆగ్నేయ తీరాన్ని నేడు భారీ భూకంపం కుదిపేసింది. తొలుత ఈ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 7.2 గా పేర్కొన్నప్పటికీ, ఆపై దాన్ని 6.9కి తగ్గించారు. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్)వెల్లడించింది. తైటుంగ్ పట్టణానికి ఉత్తరంగా 50 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జీఎస్ తెలిపింది. 

కాగా, ఈ భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జపాన్ అధీనంలోని దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భారీ స్థాయిలో ప్రకంపనలు రావడంతో ఇళ్ల నుంచి, షాపింగ్ మాల్స్ నుంచి పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఈ భూకంపం తాలూకు ప్రకంపనలు రాజధాని తైపేలోనూ వచ్చినట్టు ఓ మీడియా ప్రతినిధి వెల్లడించారు. 

ఇదే ప్రాంతంలో నిన్న 6.6 తీవ్రతతో భూకంపం సంభవించగా, నేడు అంతకుమించిన తీవ్రతతో భూమి కంపించడం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. భారీ ప్రకంపనలకు పట్టాలపై ఉన్న రైళ్లు కూడా ఊగిపోయాయి.


More Telugu News