సొంత ప్రభుత్వం గురించే అబద్ధాలు చెప్పిన ఏకైక సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు: పయ్యావుల కేశవ్

  • అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అబద్ధాలు చెప్పారు
  • ఆర్థిక పరిస్థితి బాగుంటే ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి?
  • పిల్లలకు ఇస్తున్న చిక్కీ, పాలని కూడా ప్రభుత్వం ఆపేసింది
అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసి... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్ ఇష్టం వచ్చిన లెక్కలు చెప్పారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఆ తప్పుడు లెక్కలు అధికారులు ఇచ్చినవి కాదని... ఉద్దేశ పూర్వకంగానే ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే ఉద్యోగుల జీతాలు ప్రతి నెలా ఎందుకు ఆలస్యమవుతున్నాయని ప్రశ్నించారు. రిటైర్మెంట్ బెనెఫిట్స్ విషయంలో రిటైర్డ్ ఉద్యోగులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. తన సొంత ప్రభుత్వం గురించే అబద్ధాలు చెప్పిన ఏకైక సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు.  

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకే చిన్న పిల్లలకు ఇస్తున్న చిక్కీ, పాలని కూడా ప్రభుత్వం ఆపేసిందని కేశవ్ అన్నారు. నిరుపేదల ఇళ్ల నిర్మాణం పేరుతో వచ్చిన నిధులను కూడా దారి మళ్లించారని చెప్పారు. కొన్ని పథకాల అమలుకు డబ్బుల్లేవని కోర్టుల్లో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. పుల్ దెమ్ ఔట్ అని టీడీపీ సభ్యులను ఉద్దేశించి స్పీకర్ తమ్మినేని ఎలా అంటారని అన్నారు. స్పీకర్ అనే వ్యక్తి ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ది హౌస్ అనే విషయాన్ని తమ్మినేని గుర్తించాలని చెప్పారు.


More Telugu News