భారత్‌లో ప్రతి సంవత్సరం 1.63 లక్షల మంది ఆత్మహత్య

  • హైదరాబాద్‌లో 9వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఆసియన్ సైకియాట్రీ సదస్సు
  • ఆత్మహత్యల్లో చైనాను అధిగమించిన భారత్
  • ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలోనే ఆత్మహత్యలు అధికమన్న డాక్టర్ లక్ష్మీ విజయ్ కుమార్
  • బీహార్‌లో అత్యల్పంగా 0.70 ఆత్మహత్యలు
  • తెలంగాణలో 26.9 శాతం, ఏపీలో 15.3 శాతం ఆత్మహత్యలు 
  • దేశంలో 33.2 శాతం ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలే కారణమన్న ఎన్‌సీఆర్‌బీ
కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉసురు తీస్తున్నాయి. ప్రమాదకరమైన టీబీ (క్షయ) కంటే ఎక్కువగా ఆత్మహత్యల వల్లే దేశంలో ఎక్కువమంది మరణిస్తున్నట్టు జాతీయ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదికలు చెబుతున్నాయి. దేశంలో ఏటా 1.63 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఎన్‌సీఆర్‌బీ చెబుతోంది. అయితే, వాస్తవ సంఖ్య 1.90 లక్షలకు పైగానే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతుండగా, గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ మాత్రం ఈ సంఖ్యను 2.30 లక్షలుగా పేర్కొంది.

దేశంలో ప్రతి ఏడాది పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టనట్టు వ్యవహరిస్తున్నాయని ‘స్నేహ స్వచ్ఛంద సంస్థ’ వ్యవస్థాపకురాలు డాక్టర్ లక్ష్మీ విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తన సంస్థ ద్వారా ఆత్మహత్యల నివారణకు విశేష కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న 9వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఆసియన్ సైకియాట్రీ రెండో రోజు సదస్సులో ఆమె మాట్లాడుతూ.. ఆత్మహత్యలు, వాటి నివారణపై మాట్లాడారు. 

ఆత్మహత్యల్లో గతంలో చైనా అగ్రస్థానంలో ఉండేదని, ఇప్పుడా స్థానాన్ని భారత్ ఆక్రమించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆత్మహత్యల సంఖ్య పెరిగిందన్న డాక్టర్ లక్ష్మీ విజయ్.. ఇందుకు కొవిడ్ కూడా ఒక కారణమని అన్నారు. అంతేకాదు, ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నట్టు పేర్కొన్నారు. పుదుచ్చేరిలో దేశంలోనే అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు వివరించారు. తెలంగాణలో 26.9 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 15.3 శాతం ఆత్మహత్యలు జరుగుతున్నట్టు చెప్పారు. 

దేశంలోనే అతి తక్కువగా బీహార్‌లో 0.70 శాతం ఆత్మహత్యలు నమోదైనట్టు పేర్కొన్నారు. అలాగే, 15-39 ఏళ్ల వయసు వ్యక్తుల మరణాలకు అత్యధిక శాతం ఆత్మహత్యలే కారణమన్నారు. 15-29 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ఆత్మహత్యలు మన దేశంలోనే అధికమన్నారు. దేశంలో 33.2 శాతం ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలే కారణమని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు చెబుతున్నాయని గుర్తు చేశారు. తమిళనాడులోని కొన్ని గ్రామాల్లో సెంట్రల్ స్టోరేజీ ఫెర్టిలైజర్స్ లాకర్స్ ఏర్పాటు చేశామని, దీనివల్ల గత ఆరేడేళ్లలో ఆయా గ్రామాల్లో ఆత్మహత్యలు జరగలేదని డాక్టర్ లక్ష్మీ విజయ్ వివరించారు.


More Telugu News