చీతాల సంర‌క్ష‌ణ‌లో రాజీ ప‌డొద్దు... కునో పార్క్ సిబ్బందికి మోదీ దిశానిర్దేశం

  • న‌మీబియా నుంచి 8 చీతాల‌ను తెచ్చిన కేంద్రం
  • మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కునో పార్క్‌లో వ‌దిలిన మోదీ
  • చీతాల సంర‌క్ష‌ణ కోసం ప్ర‌త్యేక సిబ్బందిని నియ‌మించిన ప్ర‌భుత్వం
  • చీతాల సంర‌క్ష‌కుల‌తో మోదీ భేటీ
  • నిబంధ‌న‌ల విష‌యంలో రాజీ ప‌డొద్ద‌ని సూచ‌న‌
  • చివ‌ర‌కు త‌న పేరు చెప్పినా వినొద్ద‌ని ఆదేశం
దేశంలో అంత‌రించిపోయిన చీతాల‌ను కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు ఎట్ట‌కేల‌కు తిరిగి వాటికి దేశంలో ప్ర‌వేశం క‌ల్పించింది. న‌మీబియా నుంచి 8 చీతాల‌ను వ్య‌య‌ప్ర‌యాస‌లకోర్చి దేశానికి త‌ర‌లించింది. బోయింగ్ విమానంలో ద‌ర్జాగా భార‌త్ చేరిన చీతాల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కునో- పాల్పూర్ నేష‌న‌ల్ పార్క్‌లో వదిలిపెట్టిన సంగ‌తి తెలిసిందే. విమానంలో వేల కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించి వ‌చ్చిన చీతాలు పార్క్‌లోకి అడుగు పెట్టిన స‌మ‌యంలో బెరుకు బెరుకుగా క‌నిపించాయి. 

ఇక వాటిని జాగ్ర‌త్త‌గా సంర‌క్షించుకోవడానికి, కునో పార్క్‌లో చీతాల సంర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేకంగా సిబ్బందిని నియ‌మించారు. చీతాల‌ను పార్క్‌లో వ‌దిలిన త‌ర్వాత చీతాల సంర‌క్ష‌కుల‌తో మోదీ ఓ చెట్టు కింద కూర్చోని సంభాషించారు. వాటి సంర‌క్ష‌ణ విష‌యంలో ఎలాంటి ఒత్తిడుల‌కు లొంగ‌వ‌ద్ద‌ని ఆయ‌న వారికి చెప్పారు. రాజ‌కీయ నేత‌లు వ‌చ్చినా, మీడియా వ‌చ్చినా... నిబంధ‌న‌ల‌ను తు.చ త‌ప్ప‌కుండా పాటించాల‌ని మోదీ సూచించారు. ఈ విష‌యంలో చివ‌ర‌కు త‌న పేరు చెప్పినా కూడా నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించ‌వ‌ద్ద‌ని సిబ్బందికి సూచించారు. చీతాల సంర‌క్షుల‌తో మోదీ మాట్లాడుతున్న వీడియోను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.


More Telugu News