రాజధాని అంశంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ వివరణ

  • గతంలో అమరావతికి అనుకూలంగా హైకోర్టు తీర్పు
  • తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
  • స్పెషల్ లీవ్ పిటిషన్ వేశామన్న మంత్రి అమర్ నాథ్
  • రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని స్పష్టీకరణ
రాజధాని విషయంలో తమ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం పట్ల ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వివరణ ఇచ్చారు. రాష్ట్రానికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కులను గుర్తు చేయడం కోసమే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని స్పష్టం చేశారు. 

మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం అనే అంశాన్ని పిటిషన్ లో ప్రస్తావించామని వెల్లడించారు. వికేంద్రీకరణపై రాష్ట్రం చేసిన చట్టం చెల్లదన్న హైకోర్టు నిర్ణయాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లామని అమర్ నాథ్ వివరించారు. 

రాజధానిపై నిర్ణయం తీసుకునే అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని రాజ్యాంగం చెబుతోందని ఉద్ఘాటించారు. ఏపీలో మూడు రాజధానులకు న్యాయపరమైన అనుమతులు పొందే దిశగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం తొలి అడుగు అని అభివర్ణించారు.


More Telugu News