'జాబులు ఎక్కడ జగన్?'.. అంటూ జ‌ల‌దీక్ష‌కు దిగిన తెలుగు యువ‌త‌... వీడియో ఇదిగో

  • జాబ్ కేలండ‌ర్ అమ‌లు కాని తీరుపై తెలుగు యువ‌త నిర‌స‌న‌లు
  • గుంటూరు ఛానెల్‌లో నీటిలోకి దిగి నిర‌స‌న వ్య‌క్తం చేసిన తెలుగు యువ‌త‌
  • ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను త‌క్ష‌ణ‌మే భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్‌
ఏపీలో విప‌క్ష పార్టీ టీడీపీ... వైసీపీ స‌ర్కారు అవ‌లంబిస్తున్న విధానాల‌పై నిత్యం నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. క్ర‌మానుగ‌తంగా ఉద్యోగాల భ‌ర్తీ అంటూ వైసీపీ స‌ర్కారు విడుద‌ల చేసిన జాబ్ కేలండ‌ర్ అమ‌లు కాని నేప‌థ్యంలో టీడీపీ యువ‌జ‌న విభాగం తెలుగు యువ‌త గ‌త కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిర‌స‌న‌లు కొన‌సాగిస్తోంది. ఇందులో భాగంగా శ‌నివారం గుంటూరు జిల్లాలో తెలుగు యువ‌త‌కు చెందిన స్థానిక నేత‌లు ఓ వినూత్న నిర‌స‌న చేప‌ట్టారు.

గుంటూరు జిల్లా ప‌రిధిలోని గుంటూరు ఛానెల్‌లోకి దిగిన తెలుగు యువత నేత‌లు... న‌డుము లోతు నీటిలో నిల‌బ‌డి 'జాబులు ఎక్కడ జగన్?' అని రాసి ఉన్న ప్ల‌కార్డుల‌ను ప‌ట్టుకుని నిర‌స‌న ప్ర‌దర్శ‌న చేప‌ట్టారు. గుంటూరు జిల్లా తెలుగు యువ‌త అధ్య‌క్షుడు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రాష్ట్ర ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను త‌క్ష‌ణ‌మే భ‌ర్తీ చేయాల‌ని ఈ సంద‌ర్భంగా వారు డిమాండ్ చేశారు.


More Telugu News