యుద్ధాలకు ఇవి రోజులు కావంటూ పుతిన్ తో ధైర్యంగా చెప్పిన మోదీని కొనియాడిన అమెరికా మీడియా

  • ఎస్ సీవో సదస్సులో మోదీ, పుతిన్ భేటీ
  • ఉక్రెయిన్ తో యుద్ధంపై మోదీ ప్రస్తావించిన వైనం
  • ఇదే ప్రధాన అంశంగా అమెరికా మీడియాలో కథనాలు
ఉజ్బెకిస్థాన్ లో ఎస్ సీవో సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం కావడం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రను ఉద్దేశించి, ఇది యుద్ధాల యుగం కాదు, యుద్ధాలకు ఇవి రోజులు కావు అని పుతిన్ కు తమ వైఖరిని స్పష్టం చేశారు. మోదీ వ్యాఖ్యలను అమెరికా ప్రధాన మీడియా స్రవంతి స్వాగతించింది.

ప్రధాని మోదీ రష్యా అధినేత పుతిన్ ను మందలించారు అని ది వాషింగ్టన్ పోస్ట్ కథనం రాసింది. "ఈ రోజుల్లో కూడా యుద్ధాలేంటి? మీతో ఫోన్ లో కూడా ఇదే అంశం ప్రస్తావించాను" అంటూ అని పుతిన్ నివ్వెరపోయేలా మోదీ మాట్లాడారని ఆ పత్రిక తమ వెబ్ ఎడిషన్ లో పేర్కొంది. 69 ఏళ్ల రష్యా దేశాధినేతకు అన్నివైపుల నుంచి నిందలు తప్పడంలేదని వివరించింది. 

ది న్యూయార్క్ టైమ్స్ కూడా ఇదే అంశంపై వెబ్ పేజీలో ప్రముఖంగా పేర్కొంది. ఇది యుద్ధాల యుగం కాదని భారత నేత రష్యా అధ్యక్షుడు పుతిన్ కు స్నేహపూర్వకంగా చెప్పారని వెల్లడించింది. పుతిన్ కూడా అందుకు సానుకూలంగా స్పందించారని ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.


More Telugu News