తిమింగలం నుంచి తప్పించుకునేందుకు సముద్రంలోంచి ఎగిరి బోటులోకి దూకిన సీ లయన్!
- చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు
- కిల్లర్ వేల్స్ రావడంతో టెన్షన్
- సీ లయన్ బరువుకి ఒరిగిపోయిన బోటు
- బ్రిటిష్ కొలంబియాలోని విక్టోరియా ప్రాంతంలో ఘటన
ఇద్దరు వ్యక్తులు చేపలు పట్టడానికి బయలుదేరారు. సముద్రంలో చిన్న బోటు వేసుకుని వెళ్తున్నారు. ఇంతలో నీటి అడుగున కలకలం. కొన్ని కిల్లర్ వేల్స్ (ఒక రకం తిమింగలాలు) ఆ ప్రాంతంలో తిరుగాడటం మొదలుపెట్టాయి. ఒక్కోసారి కిల్లర్ వేల్స్ చిన్నపాటి బోట్లపై దాడి చేస్తుంటాయి. అందుకే ఆ ఇద్దరు వ్యక్తులు వెంటనే బోటు ఇంజన్ ను ఆపేశారు. అలర్ట్ గా ఉండి చుట్టూ గమనిస్తున్నారు. కానీ ఇంతలో వారి బోటు బోల్తా పడినంత పని అయింది. ఒకరు నీటిలో పడిపోయారు కూడా. దీనికి కారణం ఒక సీ లయన్. ఇదంతా బ్రిటిష్ కొలంబియాలోని విక్టోరియా ప్రాంతంలో జరిగింది.
వేగంగా ఈదుకుంటూ వచ్చి..
వేగంగా ఈదుకుంటూ వచ్చి..
- నీటిలో కిల్లర్ వేల్స్ తిరుగుతుండటంతో వాటి నుంచి తప్పించుకునేందుకు సీ లయన్ ప్రయత్నించింది. వేగంగా ఈదుకుంటూ వచ్చింది. నీటిలోంచి గాల్లోకి ఎగిరి వారి బోటుపై దూకింది.
- నాలుగైదు వందల కిలోల బరువుండే సీ లయన్ బోటులో ఒకవైపు పడటంతో.. పడవ పూర్తిగా వంగిపోయింది. దాదాపు బోల్తా పడినంత పని అయింది.
- బోటులో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు నీటిలో పడిపోయారు కూడా. బోటుపై కాసేపు ఆగిన సీ లయన్.. బోటు ఓ పక్కకు వంగిపోవడంతో తిరిగి నీటిలోకి దూకేసింది. అయితే వారు బోటుతో తిరిగి సముద్రపు ఒడ్డుకు వస్తుంటే.. ఆ సీ లయన్ కూడా వెంట వచ్చింది. ఒడ్డుకు సమీపం దాకా వచ్చి వెనక్కి వెళ్లిపోయింది.
- అయితే కిల్లర్ వేల్స్ అక్కడి నుంచి వెళ్లిపోయాయని, తాము మాత్రం తమకు ఏమవుతుందోనని తీవ్రంగా భయపడ్డామని బోటులోని ఎర్నెస్ట్, వీసియా గోడెక్ అనే వ్యక్తులు వెల్లడించారు.
- దగ్గరిలో మరో బోటులో వెళ్తున్నవారు ఈ దృశ్యాన్ని వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారాయి.