చీతాల‌ను విడుద‌ల చేసి.. ఫొటోలు తీసిన ప్ర‌ధాని మోదీ.. వీడియో!

  • నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను కునో నేష‌న‌ల్ పార్కులోకి వ‌దిలిన మోదీ
  • ఈ ప్రాంతానికి అల‌వాటు ప‌డేందుకు వాటికి స‌మ‌యం ఇవ్వాల‌న్న ప్ర‌ధాని
  • ‘ప్రాజెక్టు చీతా’ ఈ దశాబ్దంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని వ్యాఖ్య‌
నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ ఉద‌యం అభయారణ్యంలో విడుదల చేశారు. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేసిన ఎనిమిది చీతాల్లో ఐదు ఆడ, మూడు మగవి ఉన్నాయి. ప్ర‌ధాని మోదీ తన పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చీతాలను ఎన్‌క్లోజర్ల నుంచి నేష‌న‌ల్ పార్కులోకి వ‌దిలి స్వేచ్ఛ కల్పించారు. అక్కడే ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించారు. 

వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫ‌ర్ జాకెట్‌, హ్యాట్‌, క‌ళ్ల జోడు పెట్టుకున్న మోదీ వాటిని ఫొటోలు తీశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన మోదీ ‘ప్రాజెక్టు చీతా’ ఈ దశాబ్దంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని అన్నారు. చీతాలను స్వదేశానికి తిరిగి తీసుకుని రావడంతో పాటు  వాటిని మళ్లీ భారత గడ్డపైనే సంరక్షించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. 

కాగా, కునో నేషనల్ పార్క్‌లో ఈ చీతాల‌ను చూడడానికి ప్రజలు ఓపిక పట్టాలన్నారు. కొన్ని నెలలు వేచి ఉండాలి. ‘ఈ చిరుతలు ఈ ప్రాంతానికి తెలియకుండానే అతిథులుగా వచ్చాయి. అవి కునో నేషనల్ పార్క్‌ను తమ నివాసంగా మార్చుకోవడానికి, మేము ఈ చిరుతలకు కొన్ని నెలల సమయం ఇవ్వాలి' అని మోదీ అభిప్రాయ‌ప‌డ్డారు. 

చిరుత పులుల్లో అరుదైన ర‌కాలు ఈ చీతాలు. భూమ్మీద అత్యంత వేగవంతంగా ప‌రుగెత్తే జంతువుగా రికార్డులకెక్కిన ఈ చీతాలు మన దేశంలో 1952లో అంతరించిపోయాయి. వీటిని తిరిగి దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రాజెక్టు చీతా’ ప్రపంచంలోనే తొలి అతిపెద్ద ఖండాంతర ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో భాగంగా బోయింగ్  బి747 జంబోజెట్ విమానంలో న‌మీబియా నుంచి 8 చీతాలను గ్వాలియర్ తీసుకొచ్చారు.


More Telugu News