చైనా లోన్ యాప్‌లపై ఈడీ కొరడా.. రూ. 46.67 కోట్ల నిధులను ఫ్రీజ్ చేసిన అధికారులు

  • పేటీఎం పేమెంట్ గేట్‌వేలపై ఈడీ దాడులు
  • మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు
  • గతేడాది అక్టోబరులో నాగాలాండ్‌లో నమోదైన కేసులో కొనసాగుతున్న విచారణ
రుణాలిచ్చి ఆపై దారుణాలకు పాల్పడి పలువురి ఆత్మహత్యలకు కారణమవుతున్న చైనా రుణ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. ఈజ్‌బజ్, రోజర్ పే, క్యాష్ ఫ్రీ వంటి పేటీఎం ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వేల ఖాతాల్లో వ్యాపార సంస్థలు ఉంచిన రూ. 46.67 ఖాతాల నిధులను స్తంభింపజేసింది. ఈ మేరకు ఈడీ అధికారులు తెలిపారు. ఈడీ ఇటీవల పలు చైనా రుణ యాప్‌లపై దాడులు నిర్వహించింది. అనంతరం వాటిపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకుంది. 

ఈ నెల మొదట్లో బెంగళూరులోని రేజర్ పే, పేటీఎం, క్యాష్ ఫ్రీ కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే, ఈ నెల 14న యాప్ ఆధారిత టోకెన్ హెచ్‌పీజెడ్, దాని అనుబంధ సంస్థల్లో మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ, ముంబై, ఘజియాబాద్, లక్నో, గయలలో సోదాలు నిర్వహించారు. అలాగే, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, పూణె, చెన్నై, జైపూర్, జోధ్‌పూర్‌లలోని బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేలకు చెందిన 16 సముదాయాలపైనా తనిఖీలు నిర్వహించారు. వీటికి సంబంధించి మొత్తంగా రూ. 46.67 కోట్లను ఫ్రీజ్ చేసినట్టు ఈడీ తెలిపింది.

గతేడాది అక్టోబరు 21న నాగాలాండ్‌లో నమోదైన మనీలాండరింగ్ కేసులో విచారణ జరుగుతున్నట్టు ఈడీ తెలిపింది. లోన్ యాప్‌లతోపాటు, యాప్‌లలో పెట్టుబడుల వల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తం పొందొచ్చని ప్రచారం చేసి పెట్టుబడులు స్వీకరించిన ఇన్వెస్ట్‌మెంట్ టోకన్లపైనా ఈడీ దాడులు చేసింది. కాగా, గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న ఎంఎస్ జిలియన్ కన్సల్టెంట్ ఈ పెట్టుబడుల స్వీకరణలో కీలక పాత్ర పోషించినట్టు ఈడీ గుర్తించింది.


More Telugu News