కృష్ణంరాజు అల్లూరి విగ్రహావిష్కరణకు రాలేకపోయినందుకు బాధపడ్డారు: కిషన్​రెడ్డి

  • సంస్మరణ సభలో మాట్లాడిన కిషన్ రెడ్డి, తలసాని, ఇతర ప్రముఖులు
  • కృష్ణంరాజుతో కలిసి బాహుబలి సినిమా చూశానన్న రాజ్ నాథ్ సింగ్
  • కృష్ణంరాజుతో తన తండ్రి అనుబంధాన్ని గుర్తు చేసుకున్న రఘురామ కృష్ణరాజు
కృష్ణంరాజుతో తనకు మంచి అనుబంధం ఉందని.. ప్రధానిని కలవాలంటూ ఇటీవల తనకు ఫోన్ కూడా చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తాను పాల్గొనలేకపోయినందుకు కృష్ణంరాజు ఎంతో బాధపడ్డారని కిషన్ రెడ్డి  వివరించారు. కృష్ణంరాజు పార్టీలకు అతీతంగా చిన్నా పెద్దా నేతలు, అన్ని రాజకీయ పార్టీ నాయకులతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ లో కృష్ణంరాజు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత నిర్వహించిన సంస్మరణ సభలో నేతలు మాట్లాడారు. 

కలిసి బాహుబలి సినిమా చూశాం: రాజ్ నాథ్ సింగ్
 కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి నుంచీ తనతో ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. ప్రభాస్‌ హీరోగా నటించిన బాహుబలి సినిమాని చూడాలని కృష్ణంరాజు తనను ఆహ్వానించారని.. ఇరువురి కుటుంబాలు కలిసి ఆ సినిమా చూశామని చెప్పారు. కృష్ణంరాజు సినీ, రాజకీయ రంగాలకు చేసిన సేవలను రాజ్ నాథ్ సింగ్ కొనియాడారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని పేర్కొన్నారు.

కృష్ణంరాజు మా నాన్నతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు: రఘురామ కృష్ణరాజు
కృష్ణంరాజు, తన తండ్రి సన్నిహితులని.. ఆయనతో తనకు 1976 నుంచీ పరిచయం ఉందని ఏపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు గుర్తు చేసుకున్నారు. కృష్ణంరాజు నటించిన కురుక్షేత్రం, అమరదీపం సినిమాలకు సంబంధించిన చర్చలు తనకు ఇంకా గుర్తున్నాయని చెప్పారు. కృష్ణంరాజు కేంద్ర మంత్రి అయ్యాక ఆయనను చాలాసార్లు కలిశానని తెలిపారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా కృష్ణంరాజు ధైర్యం చెప్పేవారన్నారు. తన నట వారసుడిగా ప్రభాస్‌ ను తెరపైకి తెచ్చి ఉజ్వల భవిష్యత్తు అందించారని పేర్కొన్నారు.

కృష్ణంరాజు విగ్రహం ఏర్పాటు చేస్తాం: తెలంగాణ మంత్రి తలసాని
కృష్ణంరాజు మర్యాదకు మారుపేరని.. ఆయన మంచితనం ప్రభాస్‌ కు కూడా వచ్చిందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కృష్ణంరాజు, కేసీఆర్‌ లకు మంచి అనుబంధం ఉందని.. కృష్ణంరాజు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించామని చెప్పారు. ఫిల్మ్‌ నగర్‌లో కృష్ణంరాజు విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

భక్త కన్నప్ప సినిమా విడుదల నాటి నుంచే తనకు కృష్ణంరాజుతో పరిచయం ఉందని నిర్మాత కేఎస్‌ రామారావు చెప్పారు. ఆయనతో గోల్కొండ అబ్బులు అనే సినిమా నిర్మించానని.. ప్రభాస్‌ తో బుజ్జిగాడు సినిమా చేశానని వివరించారు. కృష్ణంరాజు ఇప్పుడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.


More Telugu News