కొత్తపల్లి గీత దంపతులకు హైకోర్టు బెయిల్.. సీబీఐ కోర్టు తీర్పు అమలు నిలిపివేత!

  • మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు
  • రూ.25 వేల చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశం
  • ఈ కేసులో తర్వాతి విచారణను డిసెంబర్ 16వ తేదీన చేపడతామని ప్రకటన
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావులకు జైలుశిక్ష విధిస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు అమలును తెలంగాణ హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో దంపతులు ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి బెయిల్ పొందాలని ఆదేశించింది. ఈ కేసులో తర్వాతి విచారణను డిసెంబర్ 16వ తేదీన చేపడతామని ప్రకటించింది.

ఆర్థిక అక్రమాల కేసులో..
తప్పుడు పత్రాలతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) నుంచి రుణం తీసుకుని మోసగించిన కేసులో కొత్తపల్లి గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావులకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష చొప్పున జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో గీత, ఆమె భర్తకు సహకరించి అక్రమాలకు పాల్పడిన ఇద్దరు బ్యాంకు అధికారులకు కూడా కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 

అయితే సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ కొత్తపల్లి గీత, ఆమె భర్త తెలంగాణ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. 2014లో వైఎస్సార్ సీపీ తరఫున అరకు ఎంపీగా పోటీ చేసి గెలిచిన కొత్తపల్లి గీత.. తర్వాతి పరిణామాల్లో ఆ పార్టీని వీడారు. 2018లో సొంతంగా ఒక రాజకీయ పార్టీని నెలకొల్పినా.. తర్వాత బీజేపీలో విలీనం చేశారు.


More Telugu News