కృష్ణంరాజు మంచి స్నేహితుడు: కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్

  • ఇటీవల కన్నుమూసిన కృష్ణంరాజు
  • నేడు హైదరాబాదులో సంస్మరణ సభ
  • హాజరైన రాజ్ నాథ్ సింగ్
  • కృష్ణంరాజు చిత్రపటానికి నివాళి
ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన సంస్మరణ సభను హైదరాబాదులో నిర్వహించారు. ఇక్కడి జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. కృష్ణంరాజు చిత్రపటానికి ఆయన నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, కృష్ణంరాజు మంచి వ్యక్తి, మంచి స్నేహితుడు అని కొనియాడారు. గోహత్య నిషేధంపై పార్లమెంటులో మొట్టమొదట బిల్లు పెట్టింది కృష్ణంరాజు అని వెల్లడించారు. తెలుగు ప్రజలకు రెబల్ స్టార్ అయిన కృష్ణంరాజు, స్వగ్రామంలో అందరికీ సొంతవ్యక్తిలా మెలిగేవారని వివరించారు. కృష్ణంరాజు ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. 

కాగా, ఈ సంస్మరణ సభకు మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘురామకృష్ణరాజు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘురామ మాట్లాడుతూ, ఎవరికి కష్టం వచ్చినా కృష్ణంరాజు ఆదుకునేవారని అన్నారు. కేంద్రమంత్రిగా ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేశారని తెలిపారు.


More Telugu News