ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

  • డిప్యూటీ స్పీకర్ పదవికి నిన్న రాజీనామా చేసిన కోన రఘుపతి
  • సోమవారం జరగనున్న డిప్యూటీ స్పీకర్ ఎన్నిక
  • వైసీపీ తరపున బరిలోకి కోలగట్ల వీరభద్రస్వామి? 
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. వైసీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ వేస్తున్నట్టు సమాచారం. ఆయన ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు నామినేషన్ వేస్తారని చెపుతున్నారు. సోమవారం నాడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. సభలో ఉన్న బలాబలాల నేపథ్యంలో ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీడీపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపకపోవచ్చు.  

మరోవైపు, డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి నిన్న రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం వెంటనే ఆమోదించారు. దీంతో, ఖాళీ అయిన డిప్యూటీ స్పీకర్ పదవికి ఇప్పుడు ఎన్నిక జరగబోతోంది. ఇంకోవైపు, డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి ఎందుకు రాజీనామా చేశారనే విషయం మాత్రం ఇంత వరకు తెలియరాలేదు.


More Telugu News