సినీ కార్మికుల‌కు వేత‌నాల పెంపు... ఈ ఏడాది జులై నుంచే అమ‌లు

  • పెద్ద సినిమా కార్మికుల‌కు 30 శాతం వేత‌నాల పెంపు
  • చిన్న సినిమా కార్మికుల‌కు 15 శాతం పెర‌గ‌నున్న వేత‌నాలు
  • సంయుక్త ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన‌ ఫిల్మ్ చాంబ‌ర్‌, ఫిల్మ్ ఫెడ‌రేష‌న్‌, ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్‌లు
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన కార్మికుల‌కు ఎట్ట‌కేల‌కు వేత‌నాలు పెరిగాయి. వేత‌నాల పెంపున‌కు సంబంధించి బుధ‌వార‌మే నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ... ఎంత‌మేర పెంపు, ఎప్ప‌టి నుంచి అమ‌లు వంటి కీల‌క అంశాల‌పై గురువారం కీల‌క నిర్ణ‌యం జ‌రిగింది. ఈ మేర‌కు సినీ కార్మికుల వేత‌నాల పెంపుపై ఫిల్మ్ చాంబ‌ర్‌, ఫిల్మ్ ఫెడ‌రేష‌న్‌, ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్‌లు గురువారం సంయుక్త ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశాయి.

ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం పెద్ద సినిమాల‌కు ప‌నిచేసే కార్మికుల‌కు 30 శాతం మేర వేత‌నాలు పెర‌గ‌నున్నాయి. అదే స‌మ‌యంలో చిన్న సినిమాల‌కు ప‌నిచేసే కార్మికుల‌కు 15 శాతం వేత‌నాలు పెర‌గ‌నున్నాయి. ఏది పెద్ద సినిమా? ఏది చిన్న సినిమా? అనే విష‌యాన్ని చ‌ల‌న‌చిత్ర వాణిజ్య మండ‌లి, ఎంప్లాయిస్ ఫెడ‌రేష‌న్‌ల‌తో కూడిన క‌మిటీ నిర్ణ‌యించ‌నుంది. ఇక పెంచిన వేత‌నాలను ఈ ఏడాది జులై 1 నుంచే అమ‌లు చేయ‌నున్నారు. ఫ‌లితంగా కార్మికుల‌కు అరియ‌ర్స్ కూడా అందే అవ‌కాశాలున్నాయి. గురువారం నిర్ణ‌యించిన వేత‌నాలు 2025 జూన్ 30 వ‌ర‌కు అమ‌లులో ఉండ‌నున్నాయి.


More Telugu News