శ్రీకాళహస్తి ముక్కంటిని దర్శించుకున్న పీవీ సింధు

  • కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం
  • ఆలయంలో ప్రత్యేక పూజలు
  • జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందించిన ఆలయ వర్గాలు
  • అందరూ బాగుండాలని కోరుకున్నట్టు సింధు వెల్లడి
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు నేడు శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయాన్ని సందర్శించారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన సింధు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు, సింధు కుటుంబానికి ఆలయ ఈవో సాగర్ బాబు స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనం అనంతరం వేదపండితులు సింధు కుటుంబానికి జ్ఞాపికను బహూకరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

ఆలయం వద్ద తనను పలకరించిన మీడియాతో సింధు మాట్లాడుతూ, స్వామివారి ఆలయానికి ఎప్పుడూ వస్తుంటానని వెల్లడించారు. స్వామివారి దర్శనం జరిగిందని, అందరూ బాగుండాలని ప్రార్థించానని తెలిపారు. 2024 ఒలింపిక్స్ కు ముందు అనేక టోర్నీలు జరగనున్నాయని, వాటిలో బాగా ఆడాలని కోరుకున్నానని వివరించారు. 

ఔత్సాహిక క్రీడాకారులు తీవ్రంగా కృషి చేయాలని, అలాగే వారికి తల్లిదండ్రుల మద్దతు కూడా అవసరమని సింధు స్పష్టం చేశారు. జూనియర్ క్రీడాకారుల ఎదుగుదల కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు.


More Telugu News