మంచు ఫలకలే కాన్వాస్‌ లు.. అద్భుత చిత్రాలతో అలరిస్తున్న ఆర్టిస్ట్‌!

  • అమెరికాకు చెందిన ఆర్టిస్ట్ డేవిడ్ పోపా ఘనత
  • గడ్డకట్టిన సరస్సులు, నదులు, సముద్రాల ఉపరితలంలోని మంచుపై చిత్రాలు
  • నీళ్లు కలుషితం కాకుండా మట్టి, బొగ్గు కలిపిన స్ప్రేతో పెయింటింగ్ లు
ఆర్ట్ వేయాలంటే కాన్వాస్ కావాలి. కాగితాలో, వస్త్రాలో కావాలి. ఇవేవీ కాకుంటే కనీసం చదునుగా ఉన్న గోడలపైనా చిత్రాలు వేస్తుంటారు. కానీ అత్యంత చిత్రంగా నదులు, సముద్రాలపై తేలే మంచుపై చిత్రాలు వేస్తూ ఓ అమెరికన్ ఆర్టిస్ట్ ‘చిత్రం’గా అలరిస్తున్నాడు. అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన ఆయన పేరు డేవిడ్ పోపా. చలికాలంలో మంచుతో గడ్డకట్టుకుపోయే దేశాల్లో పర్యటిస్తూ.. నదులు, సరస్సులు, నీటి ప్రవాహాల్లో మంచుపై చిత్రాలు గీస్తూ ఉంటాడు.

బొగ్గు, మట్టితో అద్భుత చిత్రాలు..
మంచుపై చిత్రాలు వేస్తుంటాడంటే ఏదో అల్లాటప్పాగా ఏమీ ఉండవు. కాన్వాస్ పై వేసినంత అందంగా ఉంటాయి. చాలా పెద్ద పరిమాణంలో ఉంటుంటాయి. ప్రస్తుతం ఫిన్లాండ్‌ లోని బాల్టిక్‌ సముద్రంలో మంచుపై పోట్రెయిట్స్‌ గీస్తున్నాడు. మంచు ఫలకలపై చిత్రాలు గీసేందుకు మూడు నుంచి నాలుగు గంటలు పడుతుందని ఆయన చెబుతున్నాడు.
  • నదులు, సముద్రంలోని మంచుపై చిత్రాలు వేస్తాడు కాబట్టి.. నీళ్లు కలుషితం కాకుండా బొగ్గు, మట్టి కలిపి తయారు చేసిన స్ప్రేతో పెయింటింగ్ లు వేస్తాడు. వాటిని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తుంటాడు.
  • కేవలం మంచుపై చిత్రాలు వేయడం మాత్రమే ఘనత కాదు.. అంతకన్నా మరో విశేషమూ ఉంది. ఏమిటంటే అసలే నీళ్లు గడ్డకట్టుకుపోయేంత చలి. అందులోనూ మంచు ఫలకలపైకి చేరుకోవాలి. ఇందుకోసం అంత చల్లని నీటిలో వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కోసారి మంచు ఫలకలు విరిగి చల్లటి నీటిలో పడిపోతుంటాడు.
  • ఇంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నట్టు డేవిడ్ పోపా చెబుతున్నాడు.
  • ఇక ఇంతా చేసి ఆర్ట్ వేసినా ఒక్కోసారి నిమిషాల్లోనే మంచు ఫలకలు విరిగిపోతుంటాయని అంటున్నాడు.


More Telugu News