ఈ ఆసీస్ ఆటగాడి కోసం ఏదో ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ కోట్లు కుమ్మరించడం ఖాయం: అశ్విన్

  • ఇటీవల మాంచి ఫామ్ లో ఉన్న కామెరాన్ గ్రీన్
  • కివీస్ తో సిరీస్ లో రాణించిన వైనం
  • ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య గ్రీన్ కోసం పోటీ తప్పదన్న అశ్విన్
టీమిండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 23 ఏళ్ల ఆస్ట్రేలియా కుర్ర ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ పై పొగడ్తల జడివాన కురిపించాడు. అద్భుతంగా ఆడుతున్న గ్రీన్ కు ఐపీఎల్ లో విపరీతమైన గిరాకీ ఏర్పడుతుందని, అతడి కోసం ఏదో ఒక ఫ్రాంచైజీ కోట్లు కుమ్మరించడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. 

ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాకు లభించిన ఆణిముత్యం అని కామెరాన్ గ్రీన్ ను ఇప్పటికే క్రికెట్ పండితులు అభివర్ణిస్తున్నారు. కొన్నిరోజుల కిందట ముగిసిన ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ వన్డే సిరీస్ లో కామెరాన్ గ్రీన్ భీకర ఫామ్ ను ప్రదర్శించాడు. ఈ సిరీస్ ను ఆసీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ లో గ్రీన్ బ్యాట్ తోనూ, బంతితోనూ రాణించాడు. 

ఈ నేపథ్యంలో, అశ్విన్ స్పందిస్తూ, ఈసారి ఐపీఎల్ వేలంలో గ్రీన్ కోసం ఫ్రాంచైజీల మధ్య పోటీ ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపాడు. బంతిని బలంగా బాదడమే కాదు, స్వీప్ షాట్లతో స్పిన్నర్లను తెలివిగా ఎదుర్కోవడంలోనూ గ్రీన్ పరిణతి కనబరుస్తున్నాడని కితాబునిచ్చాడు. పొడవుగా ఉండడం వల్ల ఓ ఫాస్ట్ బౌలర్ గానూ ఎంతో ఆధిక్యత చూపే వీలుందని అభిప్రాయపడ్డాడు. 

పవర్ ప్లేలో గ్రీన్ వంటి ఆటగాడు క్రీజులో ఉండాలని ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోరుకుంటాయని అశ్విన్ తెలిపాడు. గ్రీన్ తనంతట తానుగా తప్పుకుంటే తప్ప, ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని వదులుకునేందుకు సిద్ధపడదని వివరించాడు. 

గ్రీన్ 2020లో భారత్ పైనే అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 14 టెస్టులాడి 723 పరుగులు నమోదు చేశాడు. వాటిలో 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. 12 వన్డేలు ఆడి 270 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటిదాకా ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. అయితే భవిష్యత్తులో ఆస్ట్రేలియాకు మూడు ఫార్మాట్లలోనూ సుదీర్ఘకాలం సేవలందించగల ఆటగాడిగా భావిస్తున్నారు.


More Telugu News