కేవలం రెండు రకాల వ్యక్తులే కాంగ్రెస్ ను వీడతారు: జైరాం రమేశ్

  • గోవాలో బీజేపీలో చేరిన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • అవినీతిపరుల గురించి తనకు తెలుసన్న జైరాం రమేశ్
  • కేసుల్లేకుండా చేసుకునేందుకే పార్టీని వీడతారని వెల్లడి
  • మరికొందరు పార్టీ నుంచి అన్నీ పొంది వెళ్లిపోతారని వివరణ
గోవాలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా బీజేపీలో చేరడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. కేవలం రెండు రకాల వ్యక్తులే కాంగ్రెస్ ను వీడతారని అభిప్రాయపడ్డారు. 

మొదటి రకం వ్యక్తులు... పార్టీ నుంచి అన్ని విధాలుగా లబ్ది పొంది, ఆపై పార్టీని విసిరికొడతారని వెల్లడించారు. గులాం నబీ ఆజాద్ ఈ మొదటి రకానికి చెందుతారని తెలిపారు. గులాం నబీ ఆజాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి పీసీసీ పదవి, కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి... ఇలా పార్టీ నుంచి అన్నిరకాలుగా లబ్ది పొందారని వివరించారు. 

ఇక, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రెండో రకానికి చెందుతారని విమర్శించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత హిమంతపై కేసు లేకుండా పోయిందని జైరాం రమేశ్ వెల్లడించారు. 

ఈ విధంగా కేసుల నుంచి తప్పించుకోవడానికి, అక్రమాలపై విచారణల నుంచి తప్పించుకోవడానికి మరికొందరు పార్టీని వీడుతుంటారని వివరించారు. అప్పటివరకు అక్రమాలు చేసినవారు కాస్తా బీజేపీలో చేరగానే సచ్ఛీలురై పోతుంటారని ఎద్దేవా చేశారు. 

"ఇప్పుడీ 8 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీ అనే వాషింగ్ మెషీన్లోకి వెళ్లారు, నా కుర్తా లాగా వారు ఎలాంటి మచ్చలేనివారిగా మారిపోతారు" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. తనకు తెలిసినంత వరకు వారు అత్యంత అవినీతిపరులు అని జైరాం రమేశ్ పేర్కొన్నారు. పోయిన నేతల గురించి బాధ లేదని, కొత్తగా 20-30 మంది యువనేతలు పార్టీలో బాధ్యతలు అందుకునేందుకు ఉరకలేస్తున్నారని వెల్లడించారు.


More Telugu News