టీ20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు కొన్ని నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి: ఐసీసీ

  • ఆస్ట్రేలియా గడ్డపై టీ20 వరల్డ్ కప్
  • అక్టోబరు 23న దాయాదుల మ్యాచ్
  • సూపర్-12 దశలో తలపడనున్న భారత్, పాక్ జట్లు
  • అదనపు టికెట్లు కూడా అయిపోయిన వైనం
ఇటీవల ఆసియాకప్ లో రెండుసార్లు తలపడి క్రికెట్ అభిమానులకు విశేషమైన వినోదాన్ని అందించిన దాయాదులు టీమిండియా, పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో సూపర్-12 దశలో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అక్టోబరు 23న ఈ కీలక సమరం జరగనుంది. 

కాగా, ఈ మ్యాచ్ కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన టికెట్లు కొద్ది సమయంలోనే అమ్ముడయ్యాయని ఐసీసీ వెల్లడించింది. అదనపు టికెట్లను తీసుకువచ్చినా, అవి కూడా కొన్ని నిమిషాల్లోనే అయిపోయాయని తెలిపింది. 

టోర్నీ ప్రారంభానికి ముందు టికెట్ల రీసేల్ కోసం ఓ అధికారిక వేదికను అందుబాటులోకి తీసుకువస్తామని, అభిమానులు టికెట్లను వాటి ముఖ విలువ వద్దే మార్చుకునే వెసులుబాటు ఉంటుందని ఐసీసీ వివరించింది. 

ఇక టోర్నీలో అన్ని మ్యాచ్ లకు కలిపి 5 లక్షలకు పైగా టికెట్లను విక్రయించినట్టు వెల్లడించింది. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే సూపర్-12 దశ ప్రారంభ మ్యాచ్ కు మాత్రం కొన్ని టికెట్లు మిగిలున్నాయని తెలిపింది. 

ఆస్ట్రేలియాలో జరిగే ఈ టీ20 వరల్డ్ కప్ అక్టోబరు 16న ప్రారంభం కానుంది. నవంబరు 13న జరిగే ఫైనల్ తో టోర్నీ ముగుస్తుంది.


More Telugu News