పర్యావరణ పరిరక్షణ కోసం ఏకంగా తన కంపెనీనే విరాళంగా ఇచ్చేసిన వ్యాపారవేత్త

  • ప్రపంచవ్యాప్తంగా వాతావరణ కాలుష్య దుష్ఫలితాలు
  • పర్యావరణ పరిరక్షణ కోసం అనేక చర్యలు
  • కీలక నిర్ణయం తీసుకున్న పెటగోనియా అధినేత
  • పెటగోనియా మార్కెట్ విలువ రూ.24 వేల కోట్లు
గ్లోబల్ వార్మింగ్ దుష్ఫలితాలు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల యూరప్ దేశాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలే అందుకు నిదర్శనం. ప్రపంచ దేశాలు పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, అందరిలోనూ అవగాహన రావాల్సి ఉంది. 

ఈ నేపథ్యంలో, అమెరికాకు చెందిన ఇవాన్ షూయినార్డ్ అనే వ్యాపారవేత్త పర్యావరణ పరిరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సంస్థను యావత్తు విరాళంగా ఇచ్చేశారు. ఇవాన్ షూయినార్డ్ కు పెటగోనియా అనే అవుట్ డోర్ దుస్తుల వ్యాపారం ఉంది. 50 ఏళ్ల కిందట ఆయన పెటగోనియా సంస్థను స్థాపించి, ఆ కంపెనీని ఎంతో అభివృద్ధి చేశారు. 

ఇప్పుడా కంపెనీపై వచ్చే లాభాలన్నింటిని పర్యావరణ కార్యక్రమాలకు, వాతావరణ కాలుష్యంపై పోరాడే సంస్థలకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, ఇవాన్ షూయినార్డ్, ఆయన భార్య, ఇద్దరు సంతానం కూడా పెటగోనియా కంపెనీలోని తమ వాటాలను విరాళంగా అందించాలని నిర్ణయించారు. 

న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం.... పెటగోనియా కంపెనీ మార్కెట్ విలువ రూ.24 వేల కోట్లు ఉంటుందని అంచనా. తన కంపెనీని విరాళంగా ఇస్తున్న నేపథ్యంలో, 'ఈ పుడమి ఒక్కటే మా వాటాదారు" అంటూ ఇవాన్ షూయినార్డ్ లేఖ రాశారు. "అందుబాటులో ఉన్న వనరులతో చేయగలిగినంత చేస్తే, ఈ అభివృద్ధి చెందుతున్న గ్రహం (భూమి) తనతోపాటు మనందరినీ కూడా ముందుకు తీసుకెళుతుంది. మనకు ఏదైనా ఆశ ఉందంటే ఇదొక్కటే" అని పేర్కొన్నారు. 

ఇక, తమ కంపెనీని మొత్తం అమ్మేసి ఆ డబ్బంతా విరాళంగా ఇవ్వొచ్చని, కానీ కొత్త యజమాని తమ విలువలను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సిబ్బందిని కొనసాగిస్తాడని చెప్పలేమని షూయినార్డ్ తన లేఖలో అభిప్రాయపడ్డారు. కంపెనీని ప్రజాపరం చేయడం మరో మార్గం అని, కానీ ఆ నిర్ణయం దారుణంగా వైఫల్యం చెందే అవకాశం ఉందని వెల్లడించారు. అందుకే, తామే ఓ మార్గాన్ని కనుగొన్నామని, కంపెనీపై వచ్చే ఆదాయం మొత్తం విరాళంగా ఇచ్చేస్తున్నామని తెలిపారు.


More Telugu News