47 సెకన్లలో హెయిర్ కట్.. వేగంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కేశాడు.. వీడియో ఇదిగో
- గ్రీస్ లోని ఏథెన్స్ కు చెందిన హెయిర్ డ్రెస్సర్ రికార్డు
- కత్తెరతో కాకుండా ట్రిమ్మర్ సాయంతో హెయిర్ కట్
- వీడియోను తమ ట్విట్టర్ ఖాతాలో పెట్టిన గిన్నిస్ బుక్ సంస్థ
- దాన్ని అసలు హెయిర్ కట్ అంటారా అంటూ కామెంట్లు
నెలకో, నెలన్నరకో ఓసారి హెయిర్ కటింగ్ కోసం వెళ్లడం మామూలే. మామూలుగా అయితే పావుగంట పడుతుంది. కాస్త స్టయిలిష్ గానో, మరేదైనా ప్రత్యేకంగానో కావాలనుకుంటే.. ఇంకో పది నిమిషాలు ఎక్కువ పడుతుంది. అలా కాకుండా కేవలం ఒక నిమిషంలోపే హెయిర్ కటింగ్ పూర్తయితే.. అదెలా అనిపిస్తుంది కదా. కానీ గ్రీస్ లోని ఏథెన్స్ కు చెందిన కాన్ స్టాంటినోస్ కౌటోపిస్ అనే హెయిర్ స్టైలిస్ట్.. కేవలం 47 సెకన్లలో హెయిర్ కటింగ్ చేసి.. గిన్నిస్ బుక్ రికార్డు సాధించాడు.
చేయించుకునే వ్యక్తి హెయిర్ ను కొలిచి మరీ..
చేయించుకునే వ్యక్తి హెయిర్ ను కొలిచి మరీ..
- మరి సెకన్లలో హెయిర్ కటింగ్ ఎలాగనే సందేహాలు అందరికీ వస్తాయి. అందుకే గిన్నిస్ బుక్ ప్రతినిధులు ముందుగానే.. కటింగ్ చేయించుకునే వ్యక్తి వెంట్రుకలను కొలిచి మరీ రికార్డు పనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
- వారు ఓకే చెప్పగానే కౌటోపిస్ కటింగ్ మొదలుపెట్టి.. 47 సెకన్లలో పూర్తి చేశాడు. అయితే అతను వాడినది కత్తెర మాత్రం కాదు. ఒక ఎలక్ట్రానిక్ ట్రిమ్మర్, దువ్వెన సాయంతో కటింగ్ చేశాడు.
- ఏదైతేనేం కటింగ్ బాగా చేశాడా.. అంటే హెయిర్ స్టైల్ ను బాగానే సెట్ చేశాడు. కటింగ్ చేశాక.. గిన్నిస్ బుక్ ప్రతినిధులు తలపై, ఇరువైపులా వెంట్రుకలను మళ్లీ కొలిచారు. ప్రమాణాల ప్రకారమే.. సరిగా కట్ చేశాడని సర్టిఫికెట్ ఇచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ ప్రతినిధులు సోషల్ మీడియాలో పెట్టారు.
- ‘అదీ కటింగేనా.. ట్రిమ్మర్ తో కటింగ్ చేయడం పెద్ద గొప్పేం కాదు..’ అనికొందరు కామెంట్ చేస్తుంటే.. ‘కొంచెం అటూ ఇటూ అయితే కటింగ్ కాదు.. క్రాఫ్ మొత్తం చెడిపోతుంది. ట్రిమ్మర్ తో చేయడం అంత సులువేంకాదు..’ అని మరికొందరు పేర్కొంటున్నారు.