రూ.5 లక్షల కోట్ల మార్కెట్ విలువ అందుకున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఎస్బీఐ రికార్డు

  • మరింత వృద్ధి సాధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • 5 ట్రిలియన్ క్లబ్ లోకి ఎంట్రీ
  • ఇప్పటికే క్లబ్ లో ఉన్న హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ
ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో విశిష్ట ఘనతను సొంతం చేసుకుంది. దేశంలో రూ.5 లక్షల కోట్ల (5 ట్రిలియన్) మార్కెట్ విలువ సాధించిన తొలి ప్రభుత్వ రంగ బ్యాంకుగా నిలిచింది. ఇటీవల కాలంలో ఎస్బీఐ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. 2021తో పోల్చితే ఎస్బీఐ షేర్ విలువ 22 శాతం పెరగడం బ్యాంకు వృద్ధికి నిదర్శనం. అందులో అత్యధికశాతం వృద్ధి గత మూడు నెలల్లోనే సాధించింది. 

కాగా, ఎస్బీఐ కంటే ముందు రెండు ప్రైవేటు బ్యాంకులు 5 ట్రిలియన్ క్లబ్ లో చేరాయి. హెచ్ డీఎఫ్ సీ మార్కెట్ విలువ 8.42 ట్రిలియన్ కాగా, ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ విలువ 6.34 ట్రిలియన్లు. 

ఇక, భారత్ లో 5 ట్రిలియన్ క్లబ్ లో ఉన్న కంపెనీలన్నింటినీ ఓవరాల్ గా చూస్తే, ఎస్బీఐ ఏడో స్థానంలో నిలుస్తుంది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (17.72 ట్రిలియన్) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో టీసీఎస్ (11.82), హెచ్ డీఎఫ్ సీ (8.42), ఇన్ఫోసిస్ (6.50), ఐసీఐసీఐ (6.34), హిందూస్థాన్ యూనిలీవర్ (6.08), ఎస్బీఐ (5.03) ఉన్నాయి.


More Telugu News