మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్టు.. తీర్పు అనంతరం అరెస్టు

  • పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో శిక్ష
  • గీతతో పాటు ఆమె భర్తకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష
  • వైద్య పరీక్షల అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు
మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను విధించింది. ఆమెతో పాటు ఆమె భర్త రామకోటేశ్వరరావుకు కూడా ఇదే శిక్షను విధించింది. బ్యాంకు అధికారులు అరవిందాక్షన్, జయప్రకాశ్ లకు కూడా ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో ఈ మేరకు శిక్షను విధించింది. ఈ కేసుకు సంబంధించి 2015లోనే సీబీఐ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. 

కోర్టు తీర్పు నేపథ్యంలో కొత్తపల్లి గీత సహా దోషులను అందర్నీ అరెస్టు చేసిన సీబీఐ అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం వీరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వీరిని అక్కడి నుంచి చంచల్ గూడ జైలుకు తరలిస్తారు. మరోవైపు తెలంగాణ హైకోర్టులో కొత్తపల్లి గీత బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. కాసేపట్లో బెయిల్ పిటిషన్ ను హైకోర్టు విచారించే అవకాశం ఉంది.


More Telugu News