ఇంత దారుణంగా మాట్లాడితే నేను నోరు మూసుకుని ఉండాలా?: వైఎస్ షర్మిల

  • స్పీకర్ తనపై చర్యలు తీసుకుంటే న్యాయపరంగా ముందుకు వెళ్తానన్న షర్మిల 
  • ప్రజలు చర్చించుకుంటున్న అంశాలనే ప్రస్తావించానని వివరణ 
  • తన పాదయాత్రను ఆపేస్తే మరో రూపంలో ప్రజల వద్దకు వెళ్తానని వెల్లడి 
పాదయాత్ర సందర్భంగా తమపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఓ టీవీ ఛానల్ తో షర్మిల మాట్లాడుతూ... స్పీకర్ పోచారం తనపై చర్యలు తీసుకుంటే న్యాయ పరంగా ముందుకెళ్తానని చెప్పారు. స్పీకర్ తనపై చర్యలు తీసుకోరనే భావిస్తున్నానని తెలిపారు. 

సీఎం కేసీఆర్ ను తాను విమర్శిస్తే స్పందించని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు... వారిని విమర్శించినప్పుడు మాత్రం స్పందిస్తున్నారని ఎద్దేవా చేశారు. తన పాదయాత్రను ఆపేస్తే మరో రూపంలో ప్రజల వద్దకు వెళ్తానని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తోనే తన ప్రసంగాలు ఉంటాయని షర్మిల చెప్పారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై తాను చేసిన విమర్శల్లో అవాస్తవాలు లేవని అన్నారు. ప్రజలు చర్చించుకుంటున్న అంశాలనే తాను ప్రస్తావించానని... ప్రజలు చర్చించే అంశాలకు ఆధారాలు ఉండవని చెప్పారు. 

తెలంగాణలో చోటు చేసుకుంటున్న విషయాలపై మాట్లాడేందుకు ప్రజలు భయపడుతున్నారని... కేసులు పెడతారనే భయం వారిలో ఉందని అన్నారు. ప్రజలే కాకుండా జర్నలిస్టులు సైతం మాట్లాడేందుకు వెనకడుగు వేస్తున్నారని చెప్పారు. నిజాలు మాట్లాడటం తప్పా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పు కాదా? అని అడిగారు. 

మంత్రి నిరంజన్ రెడ్డి తనను మరదలు అంటూ చేసిన వ్యాఖ్యలు ఎంత వరకు సమర్థనీయమని షర్మిల ప్రశ్నించారు. ఇంత దారుణంగా మాట్లాడితే తాను నోరు మూసుకుని ఉండాలా? అని అడిగారు. తనకు కూడా ఆత్మగౌరవం ఉంటుందని చెప్పారు.


More Telugu News