ఏపీలో 100 డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది కౌన్సెలింగ్ బంద్.. చర్యలు తీసుకున్న యూనివర్సిటీలు

  • నిబంధనలు పాటించని 100 కళాశాలలకు గుర్తింపు రద్దు
  • తనిఖీల్లో లోపాలను గుర్తించిన అధికారులు
  • లోపాలను సరిదిద్దుకుంటే వచ్చే ఏడాది గుర్తింపు పునరుద్ధరించే అవకాశం
  • గుర్తింపు రద్దు చేసిన కాలేజీల్లోని విద్యార్థుల కోసం మాత్రం కొనసాగింపు
నిబంధనల ప్రకారం అర్హత కలిగిన అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు, గ్రంథాలయాలు, ఇతర సౌకర్యాలు లేని ఏపీలోని దాదాపు 100 ప్రైవేటు డిగ్రీ కళాశాలలపై యూనివర్సిటీలు చర్యలు తీసుకున్నాయి. వీటిలో ఈ ఏడాది డిగ్రీ ప్రవేశాలు నిలిచిపోనున్నాయి. ఆయా కాలేజీల గుర్తింపును రద్దు చేయడంతో వాటిని కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగించారు. తొలుత ఈ కళాశాలలకు అనుమతులు లభించడంతో విమర్శలు వినిపించాయి. నిబంధనలు పాటించకున్నా అనుమతులు ఎందుకు ఇచ్చారంటూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు యూనివర్సిటీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 200 కళాశాలల జాబితాను పంపి మళ్లీ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

దీంతో మళ్లీ తనిఖీలు నిర్వహించిన అధికారులు ఆయా కాలేజీలు నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించారు. అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు, గ్రంథాలయాలు, ఇతర సౌకర్యాలు లేని 100 కాలేజీల అనుమతులు నిలిపివేసేందుకు నివేదిక ఇచ్చారు. సోమవారం జరిగిన పాలకవర్గ సమావేశాల్లో దీనికి ఆమోదం లభించడంతో ఆయా కళాశాలల గుర్తింపును రద్దు చేశారు. అయితే, ప్రస్తుతం ఆయా కాలేజీల్లో ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల కోసం మాత్రం కళాశాలలు కొనసాగుతాయి. మొదటి సంవత్సరంలో మాత్రం ఎలాంటి ప్రవేశాలు ఉండవు. ఒకవేళ కనుక లోపాలను సరిదిద్దుకుంటే మాత్రం వచ్చే ఏడాది పరిశీలించి అనుమతులు ఇస్తారు. కాగా, డిగ్రీలో ప్రవేశాలకు జులై 22న నోటిఫికేషన్ విడుదలైనా ఇప్పటి వరకు కౌన్సెలింగ్ పూర్తి కాలేదు.


More Telugu News