నేనే గనుక కెప్టెన్ అయితే.... టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా ఎంపికపై సునీల్ గవాస్కర్ స్పందన

  • ఆస్ట్రేలియా గడ్డపై టీ20 వరల్డ్ కప్
  • టీమిండియాను ఎంపిక చేసిన సెలెక్టర్లు
  • పంత్, కార్తీక్ రూపంలో ఇద్దరు కీపర్లకు స్థానం
  • తాను కెప్టెన్ అయితే ఇద్దరినీ ఆడిస్తానన్న గవాస్కర్
  • ఓవరాల్ గా జట్టు బాగుందని కితాబు
ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియాను నిన్న ఎంపిక చేశారు. సెలెక్టర్లు రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్లకు చోటిచ్చారు. అయితే పంత్, కార్తీక్ లలో ఎవరు తుది జట్టులో ఉంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

దీనిపై బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. తానే గనుక కెప్టెన్ స్థానంలో ఉంటే పంత్, కార్తీక్ ఇద్దరినీ తుది జట్టులో ఆడిస్తానని స్పష్టం చేశారు. కానీ, వీరిద్దరినీ బ్యాటింగ్ ఆర్డర్ లో దిగువనే పంపిస్తానని, పంత్ ను ఐదోస్థానంలో, కార్తీక్ ను ఏడోస్థానంలో పంపిస్తానని తెలిపారు. 

ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్యాను వినియోగించుకుంటానని, మరో నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లను జట్టులోకి తీసుకుంటానని సన్నీ పేర్కొన్నారు. జరగనున్నది మెగా ఈవెంట్ అని, కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకోకపోతే విజయాలు సాధించడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఓవరాల్ గా చూస్తే టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేసిన జట్టు బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. 

బ్యాటింగ్, బౌలింగ్ పరంగా జట్టులో సమతూకం కనిపిస్తోందని, ఈసారి టీమిండియా ప్రపంచకప్ గెలుస్తుందన్న నమ్మకం కలుగుతోందని చెప్పారు. అయితే, ఆసియా కప్ ఫలితాలను టీమిండియా ఓ గుణపాఠంలా తీసుకోవాలని గవాస్కర్ స్పష్టం చేశారు. 

ఆసియా కప్ లో టీమిండియాకు సరైన బౌలర్లు అందుబాటులో లేరని, ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ జట్టులోకి రావడంతో భారత బౌలింగ్ విభాగం పటిష్ఠంగా తయారైందని అభిప్రాయపడ్డారు.


More Telugu News