సీపీఎస్ ర‌ద్దుపై ఏపీ ప్ర‌భుత్వం స‌రికొత్త ఆలోచ‌న‌... వివరాలు ఇవిగో

  • సీపీఎస్‌ను రద్దు చేస్తామ‌ని హామీ ఇచ్చిన జ‌గ‌న్‌
  • ఇప్ప‌టిదాకా అమ‌లు కాని హామీ
  • ఆందోళ‌న బాట ప‌డుతున్న ఉద్యోగులు
  • 2004 సెప్టెంబ‌ర్ 1 నాటికి స‌ర్వీసులో చేరిన వారికే పాత పెన్ష‌న్ అంటూ కొత్త ప్ర‌తిపాద‌న‌
  • రేపు ఆయా శాఖ‌ల అధికారుల‌తో కీల‌క భేటీ కానున్న ప్ర‌భుత్వం
అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం (సీపీఎస్‌)ను ర‌ద్దు చేస్తామ‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టిదాకా ఆ హామీ నెర‌వేర‌ని నేప‌థ్యంలో గ‌త కొంత‌కాలంగా ఉద్యోగులు ఆందోళ‌న‌కు దిగుతున్నారు. ఉద్యోగ సంఘాల‌తో మంత్రుల బృందం ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిపినా ఈ స‌మ‌స్య ఓ కొలిక్కి రాని సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వైసీపీ ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి ఓ స‌రికొత్త ప్ర‌తిపాద‌న‌ను తెర మీద‌కు తీసుకొచ్చింది. 

2004 సెప్టెంబ‌ర్ 1 నాటికి ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి మాత్ర‌మే సీపీఎస్‌ను ర‌ద్దు చేస్తూ వారికి పాత పెన్ష‌న్ స్కీంను అమ‌లు చేసే దిశ‌గా వైసీపీ ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తోంది. ఈ మేర‌కు అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లోని ఉద్యోగుల వివ‌రాలు, వారు స‌ర్వీసుల్లో చేరిన తేదీల‌తో పంపాల‌ని ఆయా శాఖ‌ల‌కు మంగ‌ళ‌వారం ఆదేశాలు జారీ చేసింది. ఈ వివ‌రాలతో బుధ‌వారం జ‌ర‌గ‌నున్న స‌మావేశానికి హాజ‌రు కావాల‌ని ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రేప‌టి భేటీలో సీపీఎస్ ర‌ద్దు, పాత పెన్ష‌న్ స్కీం అమ‌లు త‌దిత‌రాల‌కు సంబంధించి ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.


More Telugu News