బ్రెజిల్ లో ఐఫోన్-14 అమ్మకాలకు చుక్కెదురు... ఆపిల్ కు భారీ జరిమానా

  • త్వరలో ఐఫోన్-14 రంగప్రవేశం
  • పవర్ అడాప్టర్ లేకుండానే అమ్మకాలు
  • బ్రెజిల్ లో ఐఫోన్-14 అమ్మకాలపై నిషేధం
  • ఆపిల్ కు రూ.18.50 కోట్ల భారీ జరిమానా
టెక్ దిగ్గజం ఆపిల్ తయారుచేసే ఐఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైనా ఐఫోన్ కొత్త మోడల్ వస్తుందంటే వేకువజాము నుంచే స్టోర్ల వద్ద సందడి నెలకొంటుంది. తాజాగా, ఆపిల్ తీసుకువస్తున్న ఐఫోన్-14 మోడల్ పైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, బ్రెజిల్ లో ఐఫోన్ కొత్త మోడల్ కు చుక్కెదురైంది. బ్రెజిల్ లో ఐఫోన్-14 అమ్మకాలపై నిషేధం విధించారు. ఈ మోడల్ పవర్ అడాప్టర్ లేకుండా వస్తుండడమే అందుకు కారణం. 

తమ దేశంలో పవర్ అడాప్టర్ లేకుండా ఐఫోన్లను విక్రయించడంపై నిషేధం విధిస్తున్నట్టు బ్రెజిల్ న్యాయ, ప్రజాభద్రత శాఖ వెల్లడించింది. అంతేకాదు, ఆపిల్ సంస్థకు రూ.18.50 కోట్ల భారీ జరిమానా వడ్డించింది. 

పవర్ అడాప్టర్ లేకుండా ఫోన్ ను విక్రయించడం వినియోగదారుల పట్ల వివక్ష చూపించడమేనని, పవర్ అడాప్టర్ లేని ఫోన్ అసంపూర్ణ ఉపకరణం అవుతుందని బ్రెజిల్ వినియోగదారుల ఫోరం 'సెనాకాన్' స్పష్టం చేసింది. కాగా, బ్రెజిల్ ప్రభుత్వ నిర్ణయంపై అప్పీలుకు వెళ్లాలని ఆపిల్ నిర్ణయించింది. బ్రెజిల్ ప్రభుత్వ అభ్యంతరాలపై సంప్రదింపులు జరుపుతామని పేర్కొంది.


More Telugu News