భారత్‌, మయన్మార్‌ సరిహద్దుల్లో తల నరికేసే యోధులు.. రెండు దేశాల పౌరసత్వం, మరెన్నో విశేషాలు ఇవిగో

  • నాగాలాండ్‌ లో ఉన్న కొన్యాక్‌ గిరిజనులకు చెందిన లోంగ్వా గ్రామం
  • ఊరి మధ్య నుంచి వెళ్లే అంతర్జాతీయ సరిహద్దు
  • రెండు దేశాల్లోనూ ఓటేసే గ్రామస్థులు
  • ఏ వైపు అయినా స్వేచ్చగా వెళ్లే వెసులుబాటు
ఎక్కడైనా ప్రత్యర్థులను మట్టికరిపించే వారే యోధులు. అందులో అనుమానం లేదు. కానీ ప్రత్యర్థి తల నరికి దానిని ఇంటికి తీసుకువచ్చినవారే ఇక్కడ యోధులు. అసలు యుక్త వయసు రాగానే వారి ధీరత్వం ఏమిటనేది పరీక్షించేందుకు పోరాటాలకు పంపుతారు. ఎంత మంది తలలు నరికితే మెడలో అన్ని బిళ్లలతో దండ వేసుకుంటారు. ఇదంతా ఎక్కడ అంటారా భారత్‌, మయన్మార్‌ సరిహద్దుల్లో నివసించే కొన్యాక్‌ తెగ గిరిజనుల కథ ఇది. నిజానికి ఈ ఆచారం కొన్నేళ్ల కిందటే ముగిసినా.. వారు నివసించే లోంగ్వా గ్రామం మాత్రం మరెన్నో ప్రత్యేకతలకు నిలయం.

ఒక్క ఊరు.. రెండు దేశాల పౌరసత్వం
సాధారణంగా దేశాల మధ్య సరిహద్దులు అంటే పెద్దపెద్ద కంచెలు, హద్దు రాళ్లు గుర్తుకువస్తుంటాయి. కానీ లోంగ్వాలో గ్రామం మధ్యలోంచి అంతర్జాతీయ సరిహద్దు వెళుతుంది. అందులో ఓవైపు భారత్‌ అయితే, మరోవైపు మయన్మార్‌ పరిధిలోకి వస్తాయి. ఇంకా చిత్రం ఏమిటంటే.. కొన్ని ఇళ్లు సరిగ్గా సరిహద్దు రేఖపై ఉన్నాయి. అంటే ఇంట్లో కొంత భాగం ఓ దేశమైతే.. మరోభాగం ఇంకో దేశం అన్నమాట. 

అయితే స్థానికంగా అలాంటి విభేదాలు ఏమీ చూడరు. ఎందుకంటే.. ఈ గ్రామం అధికారికంగానే రెండు దేశాల పరిధిలో ఉంటుంది. గ్రామస్థులకు అధికారికంగానే ఇరు దేశాల పౌరసత్వం ఉంది. మన దేశంలో ఇలాంటి పౌరసత్వం ఉన్న ఏకైక గిరిజన తెగ వీరిదే. ఇక్కడివారు రెండు దేశాల ఎన్నికల్లోనూ ఓటేస్తారు. కొందరు మయన్మార్‌ సైన్యంలోనూ పనిచేస్తుండటం గమనార్హం.

తెగ పెద్ద ఇంటిపై నుంచే సరిహద్దు
 భారత్‌, మయన్మార్‌ దేశాల మధ్య నాగాలాండ్‌ రాష్ట్రంలో ఎత్తయిన కొండలపై లోంగ్వా గ్రామం ఉంది. నాగా కొన్యాక్‌ గిరిజనులు నివసించే.. ఈ గ్రామ పెద్ద ఇంటి మీదుగానే అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ‘మేం భారత దేశంలో తింటాం. మయన్మార్‌ దేశంలో నిద్రపోతాం’ అని గ్రామపెద్ద అంటుంటారు. నిజానికి ఇక్కడ ఉండేది గ్రామపెద్ద కాదు. తెగకు నాయకుడు. అతడిని ‘ఆంఘ్‌’ లేదా ‘చీఫ్టేన్‌’ అని పిలుచుకుంటారు. కొన్యాక్‌ తెగకు చెందినవారిని అతడు నాయకుడిగా వ్యవహరిస్తాడు. ఆయనకు 60 మంది భార్యలు అని.. చుట్టూ ఇటు భారత్‌, అటు మయన్మార్‌లో ఉన్న 60 గ్రామాలను పాలిస్తుంటారని చెబుతుంటారు. చుట్టూ ఉన్న ప్రాంతాల కంటే ముందే లోంగ్వా గ్రామానికి 4జీ మొబైల్‌ నెట్‌వర్క్‌ వచ్చిందని, దానికి కారణం తెగ నాయకుడికి ఉన్న పరపతేనని అంటుంటారు.

తల నరికి తెస్తేనే వీరులు!
  • కొన్యాక్‌ తెగలో యువకులు ప్రత్యర్థి తెగలవారితో పోరాడి తల తెగనరికి తీసుకురావాల్సి ఉంటుంది. అలా చేసినవారికే యుద్ధ వీరుడిగా, యోధుడిగా గుర్తింపు ఇస్తారు.
  • ఎంత మంది తలలు నరికితే అన్ని ఇత్తడి బిళ్లలను మెడలో దండలా వేసుకుంటారు. వారిని హెడ్‌ హంటర్స్‌ గా పిలుస్తుంటారు. 1960వ దశకం నుంచి ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టినా మెడలో ‘హెడ్‌ హంటర్స్‌’ దండలను మాత్రం ధరించే తిరుగుతారు.
  • ఈ తెగలో ముఖంపై పచ్చబొట్లు వేసుకోవడం సంప్రదాయం. తెగలో వారి హోదా, ఇతర అంశాల ఆధారంగా వేర్వేరు ఆకారాల్లో పచ్చబొట్లు వేసుకుంటారు. ఇటీవలి కాలంలో ఈ తెగకు చెందిన చాలా మంది క్రైస్తవమతంలోకి మారారు.
  • లోంగ్వా పరిసర ప్రాంతాలు ప్రకృతి అందాలతో అలరారుతుంటాయి. భారత్‌ వైపు రెండు, మయన్మార్‌ వైపు మరో రెండు చిన్న నదులు ఉంటాయి. సమీపంలో షిలోయ్‌ అనే సరస్సు ఉంది. వీటితోపాటు కొన్యాక్‌ తెగవారి ఆచారాలు, వేడుకలను చూడటానికి వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది.


More Telugu News