హిందూపురం వైసీపీ కౌన్సిల‌ర్ ఇంటికి సీబీఐ...అనుచిత వ్యాఖ్య‌ల కేసులో విచార‌ణ‌

  • హైకోర్టు న్యాయ‌మూర్తుల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో నిందితుడు మారుతీ రెడ్డి
  • ఇదివ‌ర‌కే మారుతీరెడ్డిని ప్ర‌శ్నించిన సీబీఐ అధికారులు
  • తాజాగా సోమ‌వారం మ‌రోమారు ఆయ‌న‌ను ప్ర‌శ్నించిన వైనం
ఏపీ హైకోర్టు న్యాయ‌మూర్తుల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ సోమ‌వారం ఓ కీల‌క అడుగు వేసింది. అనంత‌పురం జిల్లా హిందూపురం మునిసిపాలిటీకి చెందిన వైసీపీ కౌన్సిల‌ర్ మారుతీరెడ్డిని సోమ‌వారం సీబీఐ అధికారులు ప్ర‌శ్నించారు. న్యాయ‌మూర్తుల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరెడ్డిని ఇదివ‌ర‌కే ఓ ద‌ఫా విచారించిన సీబీఐ అధికారులు... తాజాగా సోమ‌వారం మ‌రోమారు విచారించారు. 

ఏపీలో అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన వైసీపీ స‌ర్కారు వ‌రుస‌గా తీసుకున్న ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌పై దాఖ‌లైన పిటిష‌న్ల‌పై విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు వాటికి వ్య‌తిరేకంగా తీర్పులు ఇచ్చింది. దీంతో వైసీపీకి చెందిన కొంద‌రు వ్య‌క్తులు సోష‌ల్ మీడియా వేదిక‌గా హైకోర్టు న్యాయ‌మూర్తుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. 

ఈ వ్య‌వ‌హారంపై ఏపీ సీఐడీ కేసు న‌మోదు చేసినా... సీఐడీ విచార‌ణ‌తో సంతృప్తి చెంద‌ని హైకోర్టు... సీబీఐ విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. హైకోర్టు ఆదేశాల‌తో ఈ కేసులో ఇప్ప‌టికే ప‌లువురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసిన సీబీఐ... వైసీపీ నేత‌, ప్ర‌కాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌ను విచారించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సోమ‌వారం ఇదే కేసులో మారుతీరెడ్డిని సీబీఐ అధికారులు ప్ర‌శ్నించారు.


More Telugu News