రాత్రి 10 దాటితే సౌండ్ విన‌ప‌డకూడదు... హైద‌రాబాద్ ప‌బ్‌లపై హైకోర్టు ఉత్త‌ర్వులు

  • జ‌నావాసాల‌లో ప‌బ్‌ల‌కు అనుమ‌తుల‌పై హైకోర్టు విచార‌ణ‌
  • ఇళ్లు, విద్యా సంస్థ‌లున్న ప్రాంతాల్లో ప‌బ్‌ల‌కు ఎలా అనుమ‌తులిచ్చార‌ని ప్ర‌శ్న‌
  • నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన ప‌బ్‌ల‌పై న‌మోదైన కేసుల‌పై ఆరా
  • స‌మ‌గ్ర వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని 3 పోలీస్ క‌మిష‌న‌రేట్ల‌కు ఆదేశం
  • ప‌బ్‌ల‌కు అనుమ‌తుల‌పై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఆబ్కారీ శాఖ‌కు నోటీసులు
హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని ప‌బ్‌ల‌పై తెలంగాణ హైకోర్టు సోమ‌వారం కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంట‌లు దాటితే ప‌బ్‌ల‌లో ఎలాంటి సౌండ్ విన‌బ‌డ‌రాద‌ని హైకోర్టు త‌న మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా ప‌బ్‌ల‌కు అనుమ‌తుల విష‌యంలో రాష్ట్ర ఆబ్కారీ శాఖ కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న‌గ‌ర ప‌రిధిలో ఇప్ప‌టిదాకా ఎన్ని ప‌బ్‌ల‌కు అనుమ‌తులు జారీ చేశార‌న్న విష‌యాన్ని కూడా కౌంట‌ర్‌లో పేర్కొనాల‌ని హైకోర్టు ఆదేశించింది. 

జ‌నావాసాల మ‌ధ్య ప‌బ్‌ల‌కు అనుమ‌తి, ప‌బ్‌ల‌లో మ‌ద్యం స‌ర‌ఫ‌రా, పెద్ద శ‌బ్దాల‌తో కూడిన ర‌చ్చ‌పై దాఖ‌లైన పిటిష‌న్ల‌పై సోమ‌వారం హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా ఇళ్లు, విద్యా సంస్థ‌లు ఉన్న ప్ర‌దేశాల్లో ప‌బ్‌ల‌కు అనుమ‌తులు ఎలా ఇచ్చార‌ని హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. 

ఇకై రాత్రి వేళ్ల‌లో ప‌బ్‌ల‌లో మ‌ద్యం మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి సౌండ్ గానీ, నృత్యాల‌ను గానీ అనుమ‌తించ‌రాద‌ని సూచించింది. ఇప్ప‌టిదాకా నిబంధ‌న‌లు ఉల్లంఘించిన ప‌బ్‌లు, వాటిపై న‌మోదు చేసిన కేసుల వివ‌రాల‌పై కోర్టు ఆరా తీసింది. ఈ అంశపై స‌మ‌గ్ర వివ‌రాలు అందించాల‌ని న‌గ‌ర ప‌రిధిలోని ముగ్గురు పోలీస్ క‌మిష‌న‌ర్ల‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News