భారత రాష్ట్ర సమితి కాకపోతే ప్రపంచ రాష్ట్ర సమితి పెట్టుకో.. సీఎం కేసీఆర్​ పై బండి సంజయ్​ ఫైర్​

  • నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టిన బండి సంజయ్
  • కేసీఆర్ వేల కోట్లు ఖర్చు చేసినా మునుగోడులో గెలిచేది బీజేపీనేనని వ్యాఖ్య
  • వ్యవసాయ మోటార్లకు మీటర్ల విషయంలో కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నారని విమర్శ
కేసీఆర్ కుటుంబ కబంధ హస్తాల్లో తెలంగాణ బందీ అయిందని, తెలంగాణ తల్లికి విముక్తి కల్పించేందుకే తాను ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ వేల కోట్లు ఖర్చు చేసినా మునుగోడులో గెలిచేది బీజేపీయే అని పేర్కొన్నారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం సందర్భంగా హైదరాబాద్ శివార్లలోని కుత్బుల్లాపూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో సంజయ్ మాట్లాడారు.

కేఏ పాల్ తో కలిసి తిరిగినా అభ్యంతరం లేదు
సీఎం కేసీఆర్ రాష్ట్ర సమస్యలను గాలికి వదిలేసి దేశం పట్టుకు తిరుగుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కాదని, అవసరమైతే ప్రపంచ రాష్ట్ర సమితి (పీఆర్ఎస్) పెట్టుకుని.. కేఏ పాల్ తో కలిసి తిరిగినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సంజయ్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ను న్యూయార్క్, సింగపూర్ స్థాయిలో అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని.. ఎక్కడ చేశారో చూపించాలని డిమాండ్ చేశారు. చిన్న వర్షం కురిస్తే హైదరాబాద్ మునిగిపోయే పరిస్థితి ఉందని చెప్పారు.

ప్రశ్నిస్తే మతతత్వ పార్టీ అంటారా?
పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని, రైతుల రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేసినందుకు.. తమ బీజేపీని మతతత్వ పార్టీ అంటున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన గెజిట్‌ లో మోటార్లకు మీటర్లు పెట్టాలని ఉందని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని సంజయ్ ఆరోపించారు. ఆ బిల్లులో మీటర్లు పెట్టాలని ఉంటే తాను రాజీనామా చేస్తానని.. లేకుంటే సీఎం కేసీఆర్ రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు.


More Telugu News